Reliance : ఇరాన్ నుంచి ఆయిల్ కొన్నారా? పుకార్లపై రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన ప్రకటన
పుకార్లపై రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన ప్రకటన
Reliance : ఇరాన్ నుంచి ముడిచమురు కొనుగోలు చేసినట్లు వస్తున్న వార్తలపై దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఘాటుగా స్పందించింది. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ కట్టుకథలని కొట్టిపారేసింది. అంతర్జాతీయంగా చమురు రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో రిలయన్స్ ఇచ్చిన ఈ వివరణ ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగింది? పుకార్ల వెనుక కథ
ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్.. నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ నుంచి ఏకంగా 50 లక్షల బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసిందని ఆ నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న బ్రెంట్ ఫ్యూచర్స్ ధర కంటే ఎక్కువ రేటు చెల్లించి మరీ ఈ డీల్ కుదుర్చుకుందని, సముద్రంలో నిల్వ ఉన్న ఇరాన్ చమురును తెచ్చుకోవడానికి అమెరికా కొన్ని సడలింపులు ఇచ్చిందని ఆ వార్తలో సారాంశం. దీంతో ఒక్కసారిగా మార్కెట్ వర్గాల్లో చర్చ మొదలైంది.
రిలయన్స్ ఘాటు కౌంటర్
ఈ వార్తలు వెలువడిన కొన్ని గంటల్లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ రంగంలోకి దిగింది. మీడియాలో వస్తున్న కథనాలను పూర్తిగా తోసిపుచ్చింది. తమ కంపెనీ ఇరాన్ నుంచి ఎలాంటి చమురును కొనలేదని, ఆ రిపోర్టులు అవాస్తవాలని, బేస్ లెస్ అని తేల్చి చెప్పింది. "ఇలాంటి అబద్ధపు వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయి. ఏదైనా వార్తను ప్రచురించే ముందు కనీసం నిజానిజాలు, వాస్తవాలను తనిఖీ చేయాలని మేము మీడియా సంస్థలను కోరుతున్నాము" అంటూ రిలయన్స్ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.
అమెరికా ఆంక్షలు - డెడ్ లైన్ల గందరగోళం
రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. ఇరాన్ మీద ఆంక్షలు ఉన్నప్పటికీ, మార్చి 20 లోపు లోడ్ చేసిన షిప్‌మెంట్లకు ఏప్రిల్ 19 వరకు డెలివరీ తీసుకోవడానికి అమెరికా వెసులుబాటు కల్పించిందని ప్రచారం జరిగింది. దీనివల్ల సముద్రంలో నిల్వ ఉన్న చమురును రిలయన్స్ వంటి కంపెనీలు కొంటున్నాయని వార్తలు వచ్చాయి. కానీ, రిలయన్స్ మాత్రం అటువంటి డీల్ ఏదీ జరగలేదని గట్టిగా చెబుతోంది. అంతర్జాతీయ సంబంధాలు, ముఖ్యంగా అమెరికా ఆంక్షలు వంటి సున్నితమైన విషయాల్లో రిలయన్స్ ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తుందని ఈ వివరణతో స్పష్టమైంది.