Reliance: భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త సంచలనం సృష్టించడానికి ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సిద్ధమవుతోంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ప్లాట్‌ఫారమ్స్ ఐపీఓ విజయవంతంగా పూర్తై స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే, ఇప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగుతున్న టాటా గ్రూప్‌ను రిలయన్స్ వెనక్కి నెట్టనుంది. సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారతదేశంలోనే నంబర్ వన్ బిజినెస్ గ్రూప్‌గా రిలయన్స్ అవతరించనుంది. ఈ భారీ మార్పుతో కార్పొరేట్ రంగంలో సరికొత్త శకం ప్రారంభం కానుంది.

రూ.28.35 లక్షల కోట్లకు చేరనున్న మార్కెట్ క్యాప్

తాజా అంచనాల ప్రకారం.. జియో ప్లాట్‌ఫారమ్స్ కంపెనీ సుమారు రూ.10 లక్షల కోట్లకు పైగా భారీ వాల్యుయేషన్‌తో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. అక్టోబర్ మధ్య నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మార్కెట్ క్యాప్ రూ.16.37 లక్షల కోట్లుగా ఉండగా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా ఇతర లిస్టెడ్ కంపెనీలతో కలిపి మొత్తం గ్రూప్ విలువ రూ.18.05 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడు జియో ప్లాట్‌ఫారమ్స్ కూడా తోడైతే, రిలయన్స్ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.28.35 లక్షల కోట్లకు పైగా దూసుకుపోతుంది. రిలయన్స్ గ్రూప్‌నకు ఇది 13వ లిస్టెడ్ కంపెనీగా నిలవనుంది.

వెనుకబడనున్న టాటా గ్రూప్

ఇప్పటివరకు దేశంలోనే అత్యధిక మార్కెట్ క్యాప్ కలిగిన అగ్రగామిగా ఉన్న టాటా గ్రూప్‌నకు రిలయన్స్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ప్రస్తుతం టాటా గ్రూప్ కింద ఉన్న 27 లిస్టెడ్ కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.25.92 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో టీసీఎస్, టైటాన్, టాటా స్టీల్, ట్రెంట్, టాటా మోటార్స్ వంటి ప్రముఖ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే జియో ప్లాట్‌ఫారమ్స్ లిస్టింగ్ తర్వాత రిలయన్స్ గ్రూప్ మార్కెట్ విలువ టాటా గ్రూప్ కంటే సుమారు రూ.2 లక్షల కోట్లకు పైగా అధికంగా ఉండి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది.

ఇతర ప్రముఖ కార్పొరేట్ గ్రూప్‌ల స్థానాలు

భారతీయ మార్కెట్లో ఇతర ప్రధాన వ్యాపార సమూహాల పరిస్థితిని పరిశీలిస్తే, గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ రూ.17.23 లక్షల కోట్ల సంయుక్త మార్కెట్ క్యాప్‌తో మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఇందులో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. కేవలం నాలుగు లిస్టెడ్ కంపెనీలతో హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ రూ.13.9 లక్షల కోట్లతో నాల్గవ స్థానంలో నిలిచింది. అలాగే ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.10.20 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.

Tags: