Reliance Jio IPO: రిలయన్స్ జియో ఐపీఓ సంచలనం.. రూ.10.3లక్షల కోట్ల వాల్యుయేషన్‌తో మార్కెట్లోకి ఎంట్రీ
మార్కెట్లోకి ఎంట్రీ
Reliance Jio IPO: భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ప్లాట్‌ఫారమ్స్ ఐపీఓ త్వరలో ప్రారంభం కానుంది. ఈ కంపెనీ విలువ సుమారు రూ.10.3 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలవనున్న ఈ పబ్లిక్ ఆఫర్ ద్వారా దాదాపు రూ.30,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఐపీఓ అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 23 వరకు బిడ్డింగ్ కోసం అందుబాటులో ఉండనుంది. కంపెనీ ఒక్కో షేరుకు రూ.1,065 నుంచి రూ.1,119 వరకు ప్రైస్ బ్యాండ్ ప్రకటించింది.
టెలికాం రంగాన్ని పూర్తిగా మార్చేసిన జియో
2016 సంవత్సరంలో రిలయన్స్ జియో టెలికాం మార్కెట్లోకి ప్రవేశించిన సమయంలో మొబైల్ కాల్స్ అలాగే ఇంటర్నెట్ వినియోగం చాలా ఖరీదైనదిగా ఉండేది. కానీ ముకేష్ అంబానీ దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, ఉచిత వాయిస్ కాల్స్ తో పాటు అత్యంత చౌకైన ఇంటర్నెట్ డేటాను అందించారు. ఈ సంచలన నిర్ణయం దేశంలోని మిగతా టెలికాం ఆపరేటర్లపై తీవ్ర ప్రభావం చూపింది. పెద్ద ఎత్తున నెట్వర్క్ ఏర్పాటు కోసం కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టినప్పటికీ, భారత్‌ను డిజిటలీకరించాలనే లక్ష్యంతో ముకేష్ అంబానీ ఈ రిస్క్ తీసుకున్నారు.
కోట్లాది మందికి చేరువైన డిజిటల్ సేవలు
కేవలం మొబైల్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా, జియో తన సేవలను మరింత విస్తరించింది. 2017లో జియోఫోన్‌ను తీసుకొచ్చి సాధారణ ప్రజలకు కూడా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం జియో కేవలం మొబైల్ నెట్వర్క్ మాత్రమే కాకుండా జియోఫైబర్, జియోఎయిర్‌ఫైబర్ ద్వారా దేశంలోనే అతిపెద్ద ఫిక్స్డ్ బ్రాండ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. మార్చి 2026 నాటికి కోట్లాది మంది 5జీ కస్టమర్లను సొంతం చేసుకుని మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ఐపీఓ ద్వారా వచ్చే నిధులను కంపెనీ అప్పులు తీర్చడానికి అలాగే ఇతర కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనున్నారు.
ధీరూభాయ్ అంబానీ కల
దివంగత పారిశ్రామికవేత్త ధీరూభాయ్ అంబానీ ఎప్పుడూ సామాన్యుడి చేతికి టెలిఫోన్ అందాలనే కల కనేవారు. ఆయన ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని ముకేష్ అంబానీ ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. జియో కారణంగానే భారతదేశంలో ఆన్లైన్ విద్య, డిజిటల్ పేమెంట్స్, ఈ-కామర్స్ రంగం అద్భుతమైన వృద్ధిని సాధించాయి. ఇప్పుడు కేవలం టెలికాం రంగానికే పరిమితం కాకుండా 5జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీల వైపు జియో అడుగులు వేస్తోంది.