Reliance Jio IPO : అంబానీ భారీ స్కెచ్.. దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఐపీఓకు జియో రెడీ.. ఇన్వెస్టర్లకు పండగే
దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఐపీఓకు జియో రెడీ.. ఇన్వెస్టర్లకు పండగే
Reliance Jio IPO : ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తన కలల ప్రాజెక్ట్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ కోసం చకచకా పావులు కదుపుతున్నారు. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన టెలికాం విభాగం కోసం సుమారు అర డజను అంతర్జాతీయ, స్వదేశీ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ మెగా ఐపీఓ కోసం బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్, సిటీ గ్రూప్, గోల్డ్‌మన్ సాక్స్, జేఎం ఫైనాన్షియల్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ వంటి దిగ్గజ సంస్థలను సలహాదారులుగా నియమించుకున్నట్లు సమాచారం.
గత రెండు దశాబ్దాలలో రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న మొదటి ఐపీఓ ఇదే కావడంతో మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సెబీ నిబంధనలలో వచ్చిన మార్పులు కూడా అంబానీకి కలిసి వచ్చాయి. పెద్ద కంపెనీలు తమ ఈక్విటీలో కేవలం 2.5 శాతాన్ని మాత్రమే విక్రయించి లిస్ట్ అయ్యేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జియో ప్లాట్‌ఫామ్స్ సుమారు 4.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.35,000 కోట్లకు పైగా) నిధులను మార్కెట్ నుంచి సేకరించవచ్చని అంచనా. ఈ లెక్కన జియో ప్లాట్‌ఫామ్స్ మొత్తం విలువ సుమారు 170 బిలియన్ డాలర్లకు చేరువలో ఉండబోతోంది.
ప్రస్తుతం కంపెనీ ముసాయిదా పత్రాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. షరతులు, సమయపాలనపై స్పష్టత రాగానే సెబీ వద్ద ఈ పత్రాలను దాఖలు చేయనున్నారు. అయితే ఈ ఐపీఓ సమయం, నిబంధనలపై రిలయన్స్ నుంచి గానీ, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల నుంచి గానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ తెర వెనుక మాత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దేశీయ టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న జియో.. ఈ ఐపీఓ ద్వారా తన పట్టును మరింత పెంచుకోవాలని చూస్తోంది.
2026 సంవత్సరం ప్రైమరీ మార్కెట్ కు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. గత ఏడాది మొదటి త్రైమాసికంలో ఐపీఓల ద్వారా రూ.19,000 కోట్లు (2.3 బిలియన్ డాలర్లు) రాగా, ఈ ఏడాది అది రూ.14,000 కోట్లకు (1.7 బిలియన్ డాలర్లు) పరిమితమైంది. ఇలాంటి మందగమన పరిస్థితుల్లో అంబానీ జియో ఐపీఓ మార్కెట్లోకి వస్తే.. అది ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపడం ఖాయం. ఈ మెగా ఇష్యూ కోసం సామాన్య ఇన్వెస్టర్ల నుంచి పెద్ద పెద్ద ఫండ్ హౌస్‌ల వరకు అందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.