Reliance Industries : అమెరికాతో స్నేహం కోసం.. రష్యాతో ఆయిల్ కట్..అంబానీ ప్లాన్ మామూలుగా లేదు

రష్యాతో ఆయిల్ కట్..అంబానీ ప్లాన్ మామూలుగా లేదు

Update: 2025-11-21 05:33 GMT

Reliance Industries : భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదిరే అవకాశం ఉంది. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న తమ ఎగుమతి ఆధారిత రిఫైనరీలో రష్యా నుంచి కొనుగోలు చేసిన ముడి చమురు వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షలే అని కంపెనీ స్పష్టం చేసింది.

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే భారతీయ కంపెనీల్లో రిలయన్స్ అతిపెద్దది. ఈ చమురును జామ్‌నగర్‌లోని భారీ ఆయిల్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనంగా మారుస్తుంది. ఈ కాంప్లెక్స్‌లో రెండు రిఫైనరీలు ఉన్నాయి. SEZ యూనిట్ రిఫైనరీ నుంచి ఉత్పత్తి అయిన ఇంధనాన్ని యూరోపియన్ యూనియన్, అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు.పాత యూనిట్ భారతదేశంలోని దేశీయ మార్కెట్ అవసరాలను తీరుస్తుంది.

యూరోపియన్ యూనియన్ రిలయన్స్‌కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. రష్యా ఆదాయాన్ని తగ్గించడానికి యూరోపియన్ యూనియన్ కఠినమైన ఆంక్షలు విధించింది. రష్యా ముడి చమురుతో తయారుచేసిన ఇంధనాన్ని విక్రయించడం, ఎగుమతి చేయడంపై ఈ ఆంక్షలు ఉన్నాయి. అందుకే రిలయన్స్ తన ఎగుమతి యూనిట్‌లో (SEZ) రష్యా చమురు వాడకాన్ని నిలిపివేసింది. నవంబర్ 20 నుంచే SEZ రిఫైనరీలో రష్యా ముడి చమురు దిగుమతిని నిలిపివేశామని, డిసెంబర్ 1 నుంచి ఎగుమతి చేసే ఉత్పత్తులన్నీ నాన్-రష్యన్ క్రూడ్ ఆయిల్‌తో తయారు చేస్తామని రిలయన్స్ ప్రతినిధి తెలిపారు.

రిలయన్స్ ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణం, అమెరికా విధించిన ఆంక్షలు. గత అక్టోబర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్‌కు సంబంధించిన చర్యల కారణంగా రష్యాలోని రెండు అతిపెద్ద చమురు కంపెనీలైన లుకోయిల్, రోస్నెఫ్ట్ పై నిషేధం విధించారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్, రోస్నెఫ్ట్ నుంచి రోజుకు దాదాపు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలుకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. అమెరికా ఆంక్షల కారణంగా ఈ డీల్ కింద చమురు కొనుగోలును రిలయన్స్ నిలిపివేయాల్సి వచ్చింది.

అమెరికా విధించిన ఈ ఆంక్షలు, భారత్ నుంచి జరిగే కొన్ని దిగుమతులపై 50 శాతం వరకు టారిఫ్‌లు విధించిన తర్వాత వచ్చాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై ప్రతిచర్యగా ఈ టారిఫ్‌లు విధించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల మధ్య రిలయన్స్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్-యూఎస్ వాణిజ్య సంబంధాలకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News