Rupee Falls : సెంచరీకి చేరువలో రూపాయి.. పెరగనున్న పెట్రోల్, నిత్యావసరాల ధరలు?
పెరగనున్న పెట్రోల్, నిత్యావసరాల ధరలు?
Rupee Falls : భారత కరెన్సీ రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్‌కు పెరుగుతున్న డిమాండ్, ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న ఉద్రిక్తతల దెబ్బకు రూపాయి విలవిలలాడుతోంది. మంగళవారం ట్రేడింగ్‌లో రూపాయి విలువ మరో 35 పైసలు క్షీణించి, డాలర్‌తో పోలిస్తే రూ.95.63 వద్ద స్థిరపడింది. ఒక దశలో ఇది రూ.95.74 స్థాయికి కూడా పడిపోయి ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. రూపాయి పతనం కావడమంటే.. మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు భారత్‌లో మరింత ప్రియం కానున్నాయని అర్థం.
రూపాయి పతనానికి ప్రధాన కారణాలు ఇవే
ప్రస్తుతం రూపాయి పడిపోవడానికి మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనలను తిరస్కరించడం. దీనివల్ల పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకున్నాయి. రెండు, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 107 డాలర్లకు చేరడం. భారత్ తన అవసరాల కోసం చమురును దిగుమతి చేసుకుంటుంది కాబట్టి, ధర పెరిగితే డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గుతుంది. మూడు, భారత షేర్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకోవడం. సోమవారం ఒక్కరోజే విదేశీ సంస్థలు రూ.8,437 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి.
పీఎం మోదీ సీరియస్ అప్పీల్
ఈ ఆర్థిక సంక్షోభాన్ని ముందే పసిగట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. సాధ్యమైనంత వరకు మెట్రో రైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని, పెట్రోల్-డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అంతేకాకుండా, కనీసం ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరడం దేశ ఆర్థిక పరిస్థితి ఎంత గంభీరంగా ఉందో స్పష్టం చేస్తోంది.
ట్రంప్ వర్సెస్ ఇరాన్.. ముదురుతున్న రచ్చ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు కూడా మార్కెట్లను వణికించాయి. ఇరాన్ పంపిన ప్రతిపాదనలు అర్థరహితం అని కొట్టిపారేసిన ఆయన, ఈ పోరాటంలో అమెరికాదే అంతిమ విజయం అని ప్రకటించారు. ఈ అనిశ్చితి వల్ల గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింటుందనే భయంతో డాలర్ ఇండెక్స్ 98.28 స్థాయికి ఎగబాకింది. రూపాయి విలువ రాబోయే రోజుల్లో రూ.96 వరకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సామాన్యులపై పడే ప్రభావం ఎంత?
రూపాయి బలహీనపడితే దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా వంట నూనెలు, పెట్రోల్, డీజిల్, మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతుంది. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగి డాలర్లను విక్రయించడం ద్వారా రూపాయి పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చని విశ్లేషకులు ఆశిస్తున్నారు..