Dollar Vs Rupee : డాలర్‌కు చుక్కలు చూపించిన రూపాయి.. వరుసగా మూడో రోజూ భారీ లాభాలు

వరుసగా మూడో రోజూ భారీ లాభాలు

Update: 2026-05-25 11:11 GMT

Dollar Vs Rupee : అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న అనూహ్య పరిణామాలు భారత రూపాయికి భారీగా కలిసి వస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ ఇండెక్స్, ముడిచమురు ధరలు ఒకేసారి కుప్పకూలడంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గత మూడు రోజులుగా జైత్రయాత్ర సాగిస్తోంది. కేవలం మూడు ట్రేడింగ్ రోజుల్లోనే డాలర్‌పై రూపాయి ఏకంగా 1.50 శాతానికి పైగా బలోపేతం కావడం విశేషం. గత వారం బుధవారం నాటి ట్రేడింగ్‌లో రూపాయి చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యంత కనిష్ట స్థాయి రూ.96.86 కి పడిపోయింది. అయితే అక్కడ నుంచి పుంజుకున్న రూపాయి.. గడచిన మూడు రోజుల్లోనే ఏకంగా 166 పైసలు (రూ.1.66) లాభపడటం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

అమెరికా - ఇరాన్ శాంతి చర్చల ఎఫెక్ట్

గత మూడు నెలలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం ముగింపు దశకు చేరిందనే సానుకూల వార్తలు కరెన్సీ మార్కెట్‌కు పెద్ద బూస్ట్‌ను ఇచ్చాయి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ సముద్ర మార్గంలో నాకేబందీ లాంటి కొన్ని కీలకమైన అంశాలపై ఇంకా చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఇరుదేశాలు ఒక శాంతి ఒప్పందానికి చాలా వరకు చర్చలు పూర్తి చేశాయని ఫారెక్స్ ట్రేడర్లు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా శాంతి చర్చల ప్రతినిధులతో మాట్లాడుతూ.. “ఒప్పందం విషయంలో ఎవరూ తొందరపడొద్దు, ఇరుపక్షాలు తగినంత సమయం తీసుకుని సరైన నిర్ణయానికి రావాలి” అని సూచించారు. ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గి రూపాయికి భారీ సపోర్ట్ లభించింది.

భారత్ - అమెరికా ట్రేడ్ డీల్ సిద్ధం

రూపాయి ఇంతలా లాభపడటానికి మరో అతిముఖ్యమైన కారణం భారత్, అమెరికాల మధ్య జరగబోతున్న సరికొత్త వాణిజ్య ఒప్పందం. ప్రస్తుతం భారతదేశంలో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం రూబియో మాట్లాడుతూ.. భారత్, అమెరికాలు త్వరలోనే ఒక మైలురాయి లాంటి అంతరిమ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయబోతున్నట్లు ప్రకటించారు. కీలక ఖనిజాలు, ఎనర్జీ, రక్షణ రంగాలలో ఇరుదేశాల బంధం మరింత పటిష్టం కానుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ట్రేడ్ ప్రతినిధి కూడా త్వరలోనే భారత్‌కు రానుండటంతో ఈ ట్రేడ్ డీల్ ఇరుదేశాలకు భారీ ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సోమవారం ఉదయమే 40 పైసల జంప్

అంతర్జాతీయంగా వచ్చిన ఈ సానుకూల వార్తలతో సోమవారం ఉదయం ఫారెక్స్ మార్కెట్ ఓపెన్ అవ్వడమే రూపాయి మంచి లాభాలతో ప్రారంభమైంది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ కరెన్సీ మార్కెట్‌లో రూపాయి గత ముగింపు ధరతో పోలిస్తే ఏకంగా 40 పైసలు బలపడి రూ.95.20 స్థాయిని తాకింది. అంతకుముందు శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో కూడా రూపాయి ఏకంగా 75 పైసలు పెరిగి రూ.95.60 వద్ద క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. ఇదే వేగం గనుక మరికొన్ని రోజులు కొనసాగితే, రాబోయే రోజుల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.93.50 స్థాయికి కూడా చేరుకోవచ్చని ఫినరెక్స్ ట్రేజరీ అడ్వైజర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలీ అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్, క్రూడాయిల్ డౌన్

ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో అమెరికన్ డాలర్ బలాన్ని కొలిచే డాలర్ ఇండెక్స్ సోమవారం 0.20 శాతం క్షీణించి 99.04 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఏకంగా 5.43 శాతం పడిపోయి బ్యారెల్‌కు 97.92 డాలర్ల వద్దకు చేరింది. క్రూడాయిల్ ధరలు ఇలా 100 డాలర్ల మార్క్ కంటే కిందకు పడిపోవడం భారత్ లాంటి దిగుమతి దేశాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. అయితే, మే 15తో ముగిసిన వారానికి సంబంధించి భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసిన డేటా ప్రకారం.. దేశ విదేశీ మారక నిల్వలు 8.094 బిలియన్ డాలర్లు తగ్గి 688.894 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు వారం ఇవి 696.988 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

స్టాక్ మార్కెట్లలో లాభాల పంట

రూపాయి బలపడటం, క్రూడాయిల్ ధరలు తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నుంచే రాకెట్‌లా దూసుకెళ్లాయి. ప్రారంభ ట్రేడింగ్‌లోనే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 908.98 పాయింట్లు ఎగబాకి 76,317.85 పాయింట్ల వద్ద ట్రేడవ్వగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 262.65 పాయింట్లు పెరిగి 23,977.70 పాయింట్ల వద్దకు చేరింది. అయితే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) మాత్రం గత శుక్రవారం మార్కెట్లో నెట్ బేసిస్ మీద రూ.4,440.47 కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు ఎక్స్ఛేంజ్ గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, డాలర్ పతనం కారణంగా భారత మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ చాలా బలంగా ఉంది.

Tags:    

Similar News