10-Minute Delivery : డెలివరీ యాప్స్‌కు సర్కార్ షాక్..10 నిమిషాల డెలివరీకి బ్లింకిట్ గుడ్‌బై
10 నిమిషాల డెలివరీకి బ్లింకిట్ గుడ్‌బై
10-Minute Delivery : ఆన్‌లైన్ షాపింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది క్విక్ కామర్స్. అంటే ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే వస్తువు ఇంటికి రావడం. అయితే, ఈ వేగమే ఇప్పుడు డెలివరీ బాయ్స్ ప్రాణాల మీదకు వస్తోంది. 10 నిమిషాల్లో డెలివరీ చేయాలనే ఒత్తిడి వల్ల రైడర్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ 31న స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ గిగ్ కార్మికులు భారీ సమ్మె కూడా చేశారు. తమ భద్రత కోసం ఈ టైమ్ డెడ్ లైన్ తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సమస్యపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్వయంగా స్పందించారు. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపిన ఆయన, డెలివరీ సమయాన్ని కచ్చితంగా 10 నిమిషాలు అని నిర్ణయించడం సరైంది కాదని హితవు పలికారు. సరుకు అందజేయడం ముఖ్యం కానీ, ఒకరి ప్రాణాలు తీయడం కాదని స్పష్టం చేశారు. దీంతో అన్ని కంపెనీలు తమ యాప్స్ మరియు ప్రకటనల నుంచి 10 నిమిషాల ట్యాగ్‌ను తొలగిస్తామని హామీ ఇచ్చాయి. ఇప్పటికే బ్లింకిట్ తన బ్రాండింగ్ నుంచి ఈ పదాన్ని తొలగించి, మరింత నాణ్యమైన సేవలకు ప్రాధాన్యత ఇస్తోంది.
సాధారణంగా బ్లింకిట్‌లో ఒక ఆర్డర్ ప్యాక్ చేయడానికి 2.5 నిమిషాలు పడుతుంది. డెలివరీ పాయింట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు, ఒక రైడర్ గంటకు 15 కి.మీ వేగంతో వెళ్లినా 8 నిమిషాల్లో చేరుకోవచ్చు. అయితే ట్రాఫిక్, పార్కింగ్ వంటి సమస్యల వల్ల ఈ సమయం సరిపోవడం లేదు. అందుకే, ఇకపై డెలివరీ ఆలస్యమైతే తమ ఏజెంట్లకు ఎలాంటి జరిమానాలు విధించబోమని కంపెనీ స్పష్టం చేసింది. బ్లింకిట్ తన ట్యాగ్‌లైన్‌ను కూడా 10 నిమిషాల్లో డెలివరీ నుంచి వేలాది ఉత్పత్తులు మీ గుమ్మం వద్దకే అని మార్చుకుంది.