Crude Prices : ఆసియా దేశాలపై సౌదీ అరేబియా ధరల బాంబు.. రికార్డు స్థాయికి పెరిగిన క్రూడ్ ఆయిల్ రేట్లు
రికార్డు స్థాయికి పెరిగిన క్రూడ్ ఆయిల్ రేట్లు
Crude Prices : మధ్యప్రాచ్యంలో యుద్ధ సెగలు చమురు మార్కెట్‌ను దహించివేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య సాగుతున్న ఈ పోరులో చమురు ధరలు చుక్కలను తాకుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ ఆంక్షలు విధించడం, అదనపు సుంకాలు వసూలు చేస్తుండటంతో.. సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా దేశాలకు విక్రయించే తన ముడి చమురు ధరలను రికార్డు స్థాయికి పెంచేసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియా ప్రభుత్వ చమురు దిగ్గజం సౌదీ అరామ్కో మే నెల విక్రయాల కోసం తన ప్రధాన అరబ్ లైట్ ముడి చమురు ధరను భారీగా పెంచింది. ప్రాంతీయ ప్రామాణిక ధర కంటే అదనంగా బ్యారెల్‌కు 19.50 డాలర్లు ఎక్కువగా వసూలు చేయాలని నిర్ణయించింది. హోర్ముజ్ జలసంధిలో అంతరాయాల వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్ అతలాకుతలం కావడమే దీనికి ప్రధాన కారణం. నిజానికి మార్కెట్ విశ్లేషకులు ఈ పెంపు 40 డాలర్ల వరకు ఉంటుందని ఊహించినప్పటికీ.. 19.50 డాలర్ల పెంపు కూడా చారిత్రాత్మక రికార్డు కావడం గమనార్హం.
హోర్ముజ్ జలసంధి దిగ్బంధం
ప్రపంచవ్యాప్తంగా చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాలో ఐదో వంతు హోర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. అయితే, ఇరాన్ ఈ మార్గాన్ని దాదాపుగా మూసివేయడం లేదా తన అనుమతి లేకుండా వెళ్లే నౌకలపై భారీగా సుంకాలు వసూలు చేయడం చేస్తోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో, పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వచ్చే సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 50 శాతానికి పైగా పెరిగింది. అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి.
ఓపెక్ ప్లస్ ఉత్పత్తి పెంపు
రాయటర్స్ కథనం ప్రకారం.. చమురు ధరలను నియంత్రించేందుకు ఓపెక్ ప్లస్ దేశాలు ఆదివారం సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నాయి. వరుసగా రెండో నెల కూడా చమురు ఉత్పత్తి కోటాను పెంచేందుకు అంగీకరించాయి. మే నెల నుంచి రోజుకు అదనంగా 2,06,000 బ్యారెళ్ల ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు. అయితే, యుద్ధంలో దెబ్బతిన్న చమురు మౌలిక సదుపాయాల మరమ్మతుకు భారీ ఖర్చుతో పాటు ఎక్కువ సమయం పడుతుందని ఈ దేశాలు హెచ్చరించాయి. పెంచిన ఉత్పత్తి మార్కెట్లోకి వచ్చినా.. సముద్ర మార్గాల్లో భద్రత లేకపోతే ఆ చమురు వినియోగదారు దేశాలకు చేరడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ వంటి దేశాలపై ప్రభావం ఎంత?
సౌదీ అరేబియా తీసుకున్న ఈ నిర్ణయం భారత్ వంటి ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. మనం మన అవసరాల కోసం అత్యధికంగా సౌదీ నుంచి చమురు దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు సౌదీ విధించిన రికార్డు స్థాయి ప్రీమియం వల్ల మన దేశంలో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణం రిస్క్‌తో కూడుకున్నది కావడంతో ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా పెరిగాయి. యుద్ధం త్వరగా ముగియకపోతే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.