Medicines : ప్యాకింగ్ చూసే చెప్పేయొచ్చు.. టాబ్లెట్స్ ఖరీదా .. చవకదా అని ? కొత్త రూల్స్ రాబోతున్నాయి!
టాబ్లెట్స్ ఖరీదా...చవకదా అని ? కొత్త రూల్స్ రాబోతున్నాయి!;
Medicines : ఎప్పుడైనా మెడికల్ షాప్‌కి వెళ్ళినప్పుడు, ఒకే జబ్బుకి చాలా రకాల మందులు చూసి ఏది కొనాలో తెలియక తికమకపడ్డారా? లేదా డాక్టర్లు రాసిన మందుల బదులు మెడికల్ షాప్ వాళ్ళు వేరే ఖరీదైన మందులు ఇచ్చేశారని అనిపించిందా? ఇకపై ఆ ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే, మన దేశంలో మందులను ప్యాక్ చేసే విధానంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. వీటిని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తీసుకొస్తోంది. ఈ మార్పుల వల్ల మందుల ప్యాకెట్లపై ఉన్న సమాచారం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా, చవకైన జనరిక్ మందులు, ఖరీదైన బ్రాండెడ్ మందులను సులభంగా గుర్తించవచ్చు.
ఈ మార్పులు ఎందుకు అవసరమయ్యాయంటే.. ఇటీవల కాలంలో ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి. మందుల ప్యాకెట్లపై వివరాలు చాలా చిన్న అక్షరాల్లో ఉండటం వల్ల చదవడం కష్టమని, కొన్ని ప్యాకింగ్‌లు మెరుస్తూ ఉండటం వల్ల అక్షరాలు సరిగా కనిపించవని ఫిర్యాదులు వచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా, జనరిక్ మందులకు, బ్రాండెడ్ మందులకు ప్యాకింగ్‌లో పెద్దగా తేడా తెలియక చాలామంది రోగులు ఖరీదైన మందులను కొనేస్తున్నారు. ఈ సమస్యలన్నీ తీర్చడానికి ఈ కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు. దీనిపై ఒక కమిటీ కూడా పని చేస్తోంది. త్వరలోనే వారి రిపోర్ట్ వస్తుంది.
ప్రస్తుతం చాలామంది రోగులు డాక్టర్లు రాసిన బ్రాండెడ్ మందుల పేర్లనే అడుగుతుంటారు. మెడికల్ షాప్ వాళ్ళు కూడా కొన్నిసార్లు ఖరీదైన బ్రాండెడ్ మందులనే ఇస్తారు. కానీ, అవే మందులు తక్కువ ధరలో జనరిక్ రూపంలో కూడా దొరుకుతాయి. ప్యాకింగ్‌లో తేడా తెలియకపోవడం వల్ల, ఈ జనరిక్ మందుల గురించి అవగాహన లేక, ప్రజలు ఎక్కువ డబ్బు పెట్టి కొనేస్తున్నారు. ఈ గందరగోళాన్ని దూరం చేయడానికి, జనరిక్, బ్రాండెడ్ మందులను గుర్తించడానికి ఒక ప్రత్యేక గుర్తును పెట్టాలని ఆలోచిస్తున్నారు.
ఈ మార్పుల వల్ల మందుల మార్కెట్‌లో పారదర్శకత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే, మందుల గురించి పూర్తి స్పష్టత ఉంటుంది. రోగులకు మందులపై నమ్మకం పెరుగుతుంది. తమ అవసరానికి తగ్గట్టు సరైన మందును ఎంచుకోవచ్చు. మన దేశంలో మందుల అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి, రోగులకు సరైన సమాచారం ఇవ్వడం చాలా అవసరం.
ప్రభుత్వం చేయబోయే ముఖ్య మార్పులు ఇవి
మొదట మందుల ప్యాకెట్‌పై ఉండే ఎక్స్‌పైరీ డేట్, బ్యాచ్ నంబర్ లాంటి ముఖ్యమైన వివరాలను పెద్ద అక్షరాల్లో ముద్రిస్తారు. దీనివల్ల వృద్ధులు, కంటి చూపు తక్కువ ఉన్నవారు కూడా సులభంగా చదువుకోగలరు. రెండోది, ప్రస్తుతం కొన్ని మందుల ప్యాకింగ్‌లు చాలా మెరుస్తూ ఉంటాయి. దానివల్ల అక్షరాలు సరిగా కనిపించవు. కొత్త రూల్స్ ప్రకారం అలాంటి మెరిసే ప్యాకింగ్‌లను తీసేస్తారు. మూడోది, మందుల స్ట్రిప్‌పై లేదా డబ్బాపై ఎక్స్‌పైరీ డేట్‌ను ఒకే చోట కాకుండా, చాలా చోట్ల ముద్రించాలి. దీనివల్ల ప్యాకింగ్ పాడైనా, అవసరమైన వివరాలు తెలిసిపోతాయి. చివరిది, జనరిక్, బ్రాండెడ్ మందులు వేర్వేరుగా కనిపించడానికి ఒక ప్రత్యేక గుర్తును పెడతారు. దీనివల్ల రోగి ఏది చవకైన జనరిక్ మందో, ఏది ఖరీదైన బ్రాండెడ్ మందో సులభంగా తెలుసుకోవచ్చు.