SBI ATM : ఎస్‌బీఐ కస్టమర్లకు భారీ షాక్..ఏటీఎం ఛార్జీల బాదుడు మొదలు

ఏటీఎం ఛార్జీల బాదుడు మొదలు

Update: 2026-01-13 12:57 GMT

SBI ATM : ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులపై అదనపు భారాన్ని మోపింది. ఏటీఎం, ఆటోమేటెడ్ డిపాజిట్ కమ్ విత్‌డ్రావల్ మెషీన్ల పై బ్యాంకులు ఒకదానికొకటి చెల్లించుకునే ఇంటర్చేంజ్ ఫీజు పెరగడమే ఇందుకు కారణమని బ్యాంక్ పేర్కొంది. దీనివల్ల ఇతర బ్యాంకుల ఏటీఎంలను తరచుగా ఉపయోగించే వారి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఎస్‌బీఐలో సాలరీ ప్యాకేజీ అకౌంట్లు ఉన్నవారికి ఇప్పటివరకు ఒక గొప్ప వెసులుబాటు ఉండేది. వారు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి ఎన్నిసార్లైనా ఉచితంగా డబ్బులు తీసుకునేవారు. అయితే ఇకపై ఈ సదుపాయం ఉండదు. కొత్త నిబంధనల ప్రకారం.. సాలరీ అకౌంట్ హోల్డర్లు నెలకు కేవలం 10 సార్లు మాత్రమే ఇతర ఏటీఎంలను ఉచితంగా వాడుకోగలరు. ఇందులో నగదు తీసుకోవడం, బ్యాలెన్స్ చెక్ చేయడం రెండూ కలిపి ఉంటాయి. 10 సార్లు దాటితే ప్రతి లావాదేవీకి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందే.

సాధారణ పొదుపు ఖాతాదారులకు ఉచిత లావాదేవీల పరిమితిలో(5 సార్లు) ఎలాంటి మార్పు చేయలేదు కానీ, పరిమితి దాటిన తర్వాత వసూలు చేసే ఛార్జీలను పెంచింది. గతంలో ఇతర బ్యాంక్ ఏటీఎం నుంచి నగదు తీస్తే రూ. 21 చెల్లించాల్సి వచ్చేది, ఇప్పుడు దానిని రూ.23 + జీఎస్టీకి పెంచారు. అలాగే బ్యాలెన్స్ ఎంక్వయిరీ లేదా మినీ స్టేట్‌మెంట్ వంటి పనుల కోసం రూ.10 కి బదులుగా రూ.11 + జీఎస్టీ వసూలు చేయనున్నారు. అంటే ప్రతి లావాదేవీపై రూ.1 నుండి రూ.2 వరకు భారం పెరిగింది.

అయితే, అందరికీ ఈ ఛార్జీలు వర్తించవు. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా కలిగిన వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి, వీరికి ఎలాంటి కొత్త ఛార్జీలు విధించలేదు. అలాగే ఎస్‌బీఐ కార్డుతో ఎస్‌బీఐ ఏటీఎంల నుంచే నగదు విత్‌డ్రా చేసుకునే వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడేటప్పుడు మాత్రమే కస్టమర్లు తమ ఉచిత పరిమితిని దృష్టిలో ఉంచుకోవడం మంచిది. లేదంటే అనవసరంగా బ్యాంకుకు ఛార్జీలు సమర్పించుకోవాల్సి వస్తుంది.

Tags:    

Similar News