SBI: ఎస్బీఐ ఖాతాదారులకు షాక్.. అక్టోబర్ 1 నుంచి నగదు విత్‌డ్రాయల్ నిబంధనల్లో మార్పు
అక్టోబర్ 1 నుంచి నగదు విత్‌డ్రాయల్ నిబంధనల్లో మార్పు
SBI: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) అకౌంట్లపై నగదు ఉపసంహరణ నిబంధనలను సవరించింది. అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త నిబంధనల ప్రకారం ఉచిత విత్‌డ్రాయల్స్ దాటితే అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు అందించే సేవల రుసుముల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2026 అక్టోబర్ 1 నుంచి అధికారికంగా అమలులోకి రానున్నాయి. కొత్త రూల్ ప్రకారం.. ఒక నెలలో మొదటి నాలుగు నగదు విత్ డ్రాలు ఉచితంగా లభిస్తాయి. ఐదో లావాదేవీ నుంచి ప్రతి నగదు ఉపసంహరణపై 15 రూపాయల రుసుముతో పాటు జీఎస్టీ అదనంగా వసూలు చేయనున్నారు. ఏటీఎంల ద్వారా లేదా బ్యాంక్ బ్రాంచ్ వేదికగా డబ్బులు తీసినా ఈ నిబంధన వర్తిస్తుంది.
డిజిటల్ లావాదేవీలపై మారిన లెక్కింపు
ఇప్పటివరకు నాలుగు ఉచిత నగదు విత్ డ్రా లెక్కింపులో డిజిటల్ లావాదేవీలను వేరుగా చూసేవారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం డిజిటల్ విధానంలో జరిపే విత్ డ్రాలను కూడా ఉచిత పరిమితి కిందకే తీసుకురానున్నారు. గతంలో లభించిన ఈ మినహాయింపును ఎస్బీఐ పూర్తిగా రద్దు చేసింది. కాబట్టి నగదు రూపంలో తీసినా లేదా ఏటీఎం కేంద్రంగా జరిపినా మొత్తం నాలుగు సార్ల పరిమితి దాటితే ఖాతాదారులకు అదనపు భారం తప్పదు.
ఏంటి ఈ బిఎస్బిడి అకౌంట్?
సామాన్య ప్రజలకు, తక్కువ ఆదాయం ఉన్న వర్గాలకు బ్యాంకింగ్ సేవలను ఉచితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సహకారంతో ఎస్బీఐ ఈ బిఎస్బిడి ఖాతాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. చెక్ బుక్ సౌకర్యం మినహా ఏటీఎం కార్డు, ఉచిత డిపాజిట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు లభిస్తాయి. ఏటీఎం లేదా బ్యాంక్ బ్రాంచ్‌లోని విత్‌డ్రాయల్ స్లిప్ ఉపయోగించి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఖాతాదారులకు ఉచితంగా లభించే సేవలు
ఈ ఖాతా ఉన్నవారికి ఎస్బీఐ ఉచితంగా రూపే డెబిట్ కార్డును అందిస్తుంది. దీనికి ఎలాంటి వార్షిక మెయింటెనెన్స్ చార్జీలు ఉండవు. ఎన్ఇఎఫ్టి, ఆర్టిజిఎస్ విధానాల ద్వారా ఖాతాలోకి వచ్చే నగదుపై ఎలాంటి రుసుములు విధించరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చెక్కులను ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. చాలా కాలం ఉపయోగించని ఖాతాలను ఉచితంగా పునరుద్ధరించే వెసులుబాటు కూడా ఉంది. ఒకవేళ ఎస్బీఐలో ఈ బిఎస్బిడి ఖాతా తెరవాలనుకుంటే, వేరే ఏ సేవింగ్స్ అకౌంట్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే 30 రోజుల వ్యవధిలో దానిని మూసివేయాల్సి ఉంటుంది.