Share Market Today : స్టాక్ మార్కెట్‌కు బ్రేక్.. ఒక్క రోజులోనే మారిన సీన్.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

Update: 2026-02-04 08:11 GMT

Share Market Today : భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం పుణ్యమా అని మంగళవారం గుర్రంలా పరిగెత్తిన స్టాక్ మార్కెట్, బుధవారం నాటికి చల్లబడింది. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలతో దేశీయ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఐటీ రంగ షేర్లలో భారీ అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. మంగళవారం సరికొత్త రికార్డులను తాకిన భారత స్టాక్ మార్కెట్, బుధవారం ఉదయం నిరాశజనకంగా ప్రారంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 0.5 శాతం నష్టంతో 83,300 మార్కు దిగువన ట్రేడింగ్ మొదలుపెట్టగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 25,675 స్థాయి వద్ద ప్రారంభమైంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత భారీగా పెరిగిన షేర్లలో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్‌కు (లాభాల స్వీకరణ) మొగ్గు చూపడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైంది.

నేటి ట్రేడింగ్‌లో అత్యంత దారుణంగా దెబ్బతిన్నది ఐటీ రంగమే. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 5.5 శాతానికి పైగా పడిపోయింది. అమెరికాలోని వాల్ స్ట్రీట్‌లో టెక్నాలజీ షేర్ల అమ్మకాలు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఇక్కడ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్‌ట్రీ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఐటీతో పాటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా 0.18 శాతం నుంచి 0.48 శాతం వరకు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రూపాయి విలువలో ఒడిదుడుకులు, కమోడిటీ ధరల మార్పు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

అంతర్జాతీయంగా చూస్తే, ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాట పట్టాయి. జపాన్‌కు చెందిన నికాయ్ 225 ఇండెక్స్ టెక్ షేర్ల ఒత్తిడితో 1.2 శాతం పడిపోయింది. అయితే దక్షిణ కొరియా మార్కెట్లు మాత్రం కొంత సానుకూలతను ప్రదర్శిస్తున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లో ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ వంటి టెక్ దిగ్గజాల షేర్లలో అమ్మకాల వెల్లువ రావడంతో, ఆ సెగ నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ రంగ షేర్లపై పడింది.

భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, అమెరికాతో కుదిరిన ట్రేడ్ డీల్ వల్ల దీర్ఘకాలికంగా లాభాలు ఉన్నప్పటికీ, స్వల్పకాలికంగా మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. శుక్రవారం వెలువడనున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాల వరకు ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ ఒక రేంజ్ బౌండ్‌లో కదలాడే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News