Shilpa Shetty : రూ.60కోట్ల మోసం కేసులో ఇరుక్కున్న శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా.. అసలేం జరిగిందంటే ?

అసలేం జరిగిందంటే ?;

Update: 2025-08-14 15:21 GMT

Shilpa Shetty : బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మరోసారి కష్టాల్లో చిక్కుకున్నారు. ఈ సెలబ్రిటీ జంటపై రూ.60 కోట్ల ఆర్థిక మోసం ఆరోపణలతో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. బిజినెస్ పేరుతో డబ్బులు తీసుకుని వ్యక్తిగత ఖర్చుల కోసం వాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్ కుంద్రాపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు, గతంలో అశ్లీల చిత్రాల కేసు, మనీ లాండరింగ్ కేసుల్లో కూడా ఆయన ఇరుక్కున్నారు.

లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్, వ్యాపారవేత్త దీపక్ కోఠారి ఈ సెలబ్రిటీ జంటపై ఫిర్యాదు చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం.. రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి తమ వ్యాపారాన్ని విస్తరించడానికి డబ్బు అప్పుగా తీసుకున్నారు. కానీ ఆ డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం, 2015లో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా వారి అప్పటి కంపెనీ బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కోసం ఒక మధ్యవర్తి ద్వారా కోఠారిని సంప్రదించారు. తమకు రూ.75 కోట్ల లోన్ కావాలని అడిగారు, దీనిపై సంవత్సరానికి 12% వడ్డీ చెల్లిస్తామని వాగ్దానం చేశారు.

ఆ తర్వాత ఈ జంట ఆ లోన్‌ను పెట్టుబడిగా మార్చమని కోరారు. దానికి బదులుగా ప్రతి నెలా కొంత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో, 2015లో కోఠారి రెండు విడతలుగా షేర్ సబ్‌స్క్రిప్షన్ ఒప్పందం ద్వారా దాదాపు రూ.60 కోట్లు బెస్ట్ డీల్ టీవీ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. కానీ, ఇంతవరకు ఆ డబ్బును తిరిగి చెల్లించలేదని కోఠారి ఆరోపించారు. పలుమార్లు డబ్బు కోసం ప్రయత్నించినా ప్రయోజనం లేదని, ఆ దంపతులు తమ స్వప్రయోజనాల కోసం డబ్బును అక్రమంగా ఉపయోగించుకున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆరోపణలపై శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా తరపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ స్పందించారు. తన క్లయింట్లపై తప్పుడు ఆరోపణలు చేసి వారి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇది ఒక పాత లావాదేవీ అని, ఈ అంశంపై ఇప్పటికే ఎన్‌సీఎల్‌టీ ముంబైలో ఒక నిర్ణయం వెలువడిందని ఆయన తెలిపారు. ఆ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి, చివరికి చట్టపరమైన పోరాటంలో ఇరుక్కుపోయిందని ఆయన వివరించారు. ఈ కేసు కేవలం పౌర సంబంధితమైనదని, తన క్లయింట్లపై ఉన్న ఆరోపణలను వారు ఖండిస్తున్నారని పాటిల్ పేర్కొన్నారు. ఈ కేసుపై పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News