Silver Price : ఏకంగా 23% పడిపోయిన వెండి ధరలు.. ఇప్పుడు కొనడం మంచిదేనా, లేక ఆగాలా?
ఇప్పుడు కొనడం మంచిదేనా, లేక ఆగాలా?
Silver Price : ఈ ఏడాది బంగారం, వెండి మార్కెట్లో ఊహించని స్థాయిలో ధరల హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వెండి మెరుపులు రోజురోజుకూ మసకబారుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర ఏకంగా 23 శాతం మేర పడిపోయింది. ఒక్క జూన్ నెలలోనే వెండి ఏకంగా 22 శాతం నష్టపోయింది. ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయిలో 121 డాలర్లుగా ఉన్న ఔన్స్ వెండి ధర, ప్రస్తుతం 58 డాలర్ల వద్ద ఊగిసలాడుతోంది. మన భారతదేశంలో దిగుమతి సుంకాలు, స్థానిక పన్నులతో కలిపి కేజీ వెండి ధర ప్రస్తుతం దాదాపు రూ.2.20 లక్షల వద్ద కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రతి చిన్న ఇన్వెస్టర్ మనసులోనూ ఓకే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.. వెండి కొనడానికి ఇది సరైన సమయమేనా? లేక ఇంకా ధరలు తగ్గే వరకు వేచి చూడాలా? అని.
ధరల పతనానికి అసలు కారణాలు ఏమిటి?
వెండి ధరలు ఇంత దారుణంగా పడిపోవడానికి ప్రధాన కారణం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణమే. ఇరాన్ యుద్ధ భయాల వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ సముద్ర మార్గంలో చమురు రవాణా చేసే నౌకలు నిలిచిపోయాయి. దీంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా బారెల్‌కు 86 డాలర్లకు పైగా పెరిగాయి. చమురు ధరలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అక్కడ వడ్డీ రేట్లు 3.5 నుంచి 3.75 శాతంగా ఉండగా, సెప్టెంబర్‌లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు బంగారం, వెండి వంటి లోహాల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని డాలర్లలో పెట్టుబడి పెడతారు. డాలర్ బలంగా మారడమే వెండి ధరలపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది.
సప్లై కొరత ఉన్పా పతనం ఆగడం లేదు
బంగారంతో పోలిస్తే వెండి మార్కెట్ పరిమాణం చాలా చిన్నది (సుమారు 3 ట్రిలియన్ డాలర్లు). అందుకే ఇందులో స్పెక్యులేషన్ (ట్రేడర్ల ఊహాగానాలు), తీవ్రమైన హెచ్చుతగ్గులు ఎక్కువ. మే నెలలోనే వెండి ఒకానొక దశలో ఏకంగా 40 శాతం వరకు క్రష్ అయ్యి ఇన్వెస్టర్లను భయపెట్టింది. అయితే నాణేనికి మరోవైపు పారిశ్రామిక రంగానికి సంబంధించి వెండికి విపరీతమైన డిమాండ్ ఉందనేది నిజం. ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్ల తయారీలో వెండిని విరివిగా ఉపయోగిస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం ఈ ఏడాది కూడా వెండి ఉత్పత్తి కంటే దాని డిమాండ్ ఏకంగా 46 మిలియన్ ఔన్సులు ఎక్కువగా ఉండబోతోంది. సప్లై కొరత ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ద్రవ్య పరిణామాలు వెండిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతానికి వెండి ధరలు అకస్మాత్తుగా పెరగడానికి ఎటువంటి బలమైన సానుకూల కారణాలు కనిపించడం లేదు. సెప్టెంబర్ నెలలో అమెరికా వడ్డీ రేట్ల పెంపుపై స్పష్టత వచ్చే వరకు లేదా ముడి చమురు ధరలు తగ్గే వరకు వెండి ధరలు ఇదే శ్రేణిలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీ మొత్తం పొదుపు మొత్తంలో కేవలం 10 శాతాన్ని మాత్రమే వెండి లేదా బంగారంలో కేటాయించడం శ్రేయస్కరం. అప్పులు చేసి లేదా లోన్లు తీసుకుని వెండిలో ఎట్టిపరిస్థితుల్లోనూ పెట్టుబడి పెట్టకూడదు. అదేవిధంగా మీ వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని ఒకేసారి కాకుండా, కొద్దికొద్దిగా (SIP రూపంలో) సుదీర్ఘ కాలం కోసం పెట్టుబడి పెడితే మంచి లాభాలు సాధించవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.