SIM Card New Rules: మీ పేరు మీద పరిమితికి మించి మొబైల్ సిమ్ కార్డులు ఉన్నాయా? అయితే వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో పరిమితికి మించి ఉన్న మొబైల్ సిమ్ కార్డుల వాడకంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 24 నుంచి టెలికాం కంపెనీలు పరిమితి దాటిన వినియోగదారులను గుర్తించి వారికి కొత్త సిమ్ కార్డులు జారీ చేయకుండా నిరోధించే సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు టెలికాం శాఖ ఆగస్టు 17న అన్ని టెలికాం ఆపరేటర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఎవరైనా వ్యక్తి అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ కనెక్షన్లు కలిగి ఉంటే కొత్త సిమ్ అభ్యర్థనలను వెంటనే తిరస్కరిస్తారు.

ఒక్కరి పేరిట ఎన్ని సిమ్ కార్డులు ఉండవచ్చంటే?

నిజానికి ఒకరి పేరిట కొన్ని కనెక్షన్లు మాత్రమే ఉండాలనే నిబంధన కొత్తదేమీ కాదు. 2012 ఆగస్టు 9 నుంచి అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తన పేరు మీద గరిష్టంగా 9 మొబైల్ కనెక్షన్లు మాత్రమే పొందే వీలుంది. వేర్వేరు టెలికాం కంపెనీల నుంచి తీసుకున్న సిమ్ కార్డులను కూడా ఈ లెక్కలోనే చేరుస్తారు. అయితే ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, అసోం ప్రాంతాల్లో భద్రతా కారణాల రీత్యా ఈ పరిమితిని కేవలం 6 కనెక్షన్లుగానే నిర్ణయించారు. వినియోగదారులు వేర్వేరు ఆపరేటర్ల నుంచి తీసుకున్న సిమ్ కార్డులు కూడా ఈ మొత్తం సంఖ్య పరిమితికే వర్తిస్తాయి.

డిజిటల్ ఇంటిలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిఘా

కొత్త నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు కేంద్ర టెలికాం శాఖ డిజిటల్ ఇంటిలిజెన్స్ ప్లాట్‌ఫామ్‎ను రంగంలోకి దించింది. అన్ని టెలికాం ఆపరేటర్ల వద్ద ఉన్న డేటాను ఒకే చోటకు చేర్చి ఒక వ్యక్తి పేరిట ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో ఇది పక్కాగా నిర్ధారిస్తుంది. కొత్త సిమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు కస్టమర్ అప్లికేషన్ ఫారమ్‌లో తమ పేరిట ఉన్న ఇతర కంపెనీల కనెక్షన్ల వివరాలను తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. ఆగస్టు 23 నుంచి ఈ ప్లాట్‌ఫామ్‌లో పరిమితి దాటిన వినియోగదారుల వివరాలతో పాటు వారి ఫోటోలను కూడా అందుబాటులో ఉంచనున్నారు.

ఉల్లంఘిస్తే తక్షణమే కనెక్షన్ రద్దు

టెలికాం కంపెనీలు తమ డేటాబేస్ వ్యవస్థను ఈ నూతన ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయడానికి నవంబర్ 30 వరకు సమయం ఇచ్చారు. ఈ లోపు ఏ వినియోగదారుడైనా పరిమితికి మించి ఒక్క రోజు అదనపు సిమ్ ఉపయోగించినా సరే ఆ కనెక్షన్‌ను తక్షణమే నిలిపివేయాల్సి ఉంటుంది. ప్రతీ ఒక్కరి పేరిట ఉండే మొబైల్ కనెక్షన్ల సంఖ్య నిబంధనల పరిధిలోనే ఉండాలని, సైబర్ నేరాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి మీ పేరు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో ఒకసారి సరిచూసుకోవడం ఎంతో మంచిది.

Tags: