SIP: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) ద్వారా దీర్ఘకాలంలో కోటీశ్వరులు కావొచ్చని ప్రచారం జరుగుతున్న వేళ, డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ సంచలన నిజాలను వెల్లడించింది. 20 ఏళ్ల క్రితం నాటి ఆదాయం, నేటి ప్రతి వ్యక్తి రాబడిని పోలుస్తూ ఎస్ఐపీ పెట్టుబడుల వెనుక ఉన్న ఆసక్తికరమైన గణాంకాలను బయటపెట్టింది. నేటి కాలంలో నెలకు రూ.10,000 ఎస్ఐపీ చేయడం ఒక సగటు ఉద్యోగికి సాధ్యమయ్యే విషయమే. నిఫ్టీ 50 టీఆర్‌ఐ ప్రకారం సెప్టెంబర్ 2006 నుంచి ఆగస్టు 2026 వరకు ప్రతి నెల రూ.10,000 చొప్పున పెట్టుబడి పెడితే రూ.87.3 లక్షల నిధి సమకూరేది. 2006 కాలంలో నెలకు రూ.10,000 పెట్టుబడి పెట్టడం ఏమాత్రం తేలికైన విషయం కాదు. నాటి జాతీయ తలసరి రాబడితో పోలిస్తే అది 350 శాతానికంటే ఎక్కువ. అంటే ఈ రోజుల్లో రూ.10,000 ఆదా చేయడం ఎంత సులభమో, రెండ దశాబ్దాల క్రితం అంత సొమ్ము ఆదా చేయడం అత్యంత కష్టమైన పని.

ఆదాయంతో పాటు పెరిగే ఎస్ఐపీ లెక్కలు

ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని డీఎస్పీ నేత్ర నివేదిక ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఆ రోజుల్లో ఒక సగటు వ్యక్తి తన రాబడికి తగ్గట్టు రూ.1,536లతో ఎస్ఐపీ ప్రారంభించి, ఏటికేడాది ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఆ పెట్టుబడి మొత్తాన్ని పెంచుకుంటూ వచ్చి ఉంటే బాగుండేది. క్రమంగా ఆ మొత్తం నేడు నెలకు రూ.10,000కు చేరుకుంటుంది. ఈ పద్ధతిలో 20 ఏళ్లలో పెట్టిన మొత్తం పెట్టుబడి దాదాపు రూ.12.2 లక్షలు కాగా, చివరకు చేతికి అందే మొత్తం రూ.31.9 లక్షలు అవుతుంది. ఏకధాటిగా రూ.10,000 చొప్పున పెడితే వచ్చే రూ.87.3 లక్షల నిధితో పోలిస్తే ఇందులో రూ.55 లక్షల వ్యత్యాసం కనిపిస్తుంది.

నిజ జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు

కాగితాల మీద ఎస్ఐపీ లెక్కలు వేయడం, ప్రణాళికలు రచించడం చాలా సులభంగా అనిపిస్తుంది. నిజ జీవితంలో 20 ఏళ్ల పాటు వరుసగా ఒక్క నెల కూడా విరామం లేకుండా పెట్టుబడి కొనసాగించడం అంత తేలిక కాదు. ఉద్యోగం పోవడం, జీతాలు తగ్గడం, హఠాత్తుగా వచ్చే వైద్య అత్యవసర ఖర్చులు ఎస్ఐపీకి అడ్డంకిగా మారతాయి. మార్కెట్‌లో తీవ్రమైన హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు భయంతో చాలామంది ఎస్ఐపీలను రద్దు చేసుకోవడం లేదా ఉన్న సొమ్మును వెనక్కి తీసుకోవడం చేస్తారు. దీనివల్ల చివరికి వచ్చే రాబడి దారుణంగా పడిపోతుంది.

చిన్న మొత్తంతో మొదలుపెట్టి విజయం దిశగా

ఈ విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ప్రధాన విషయమేమిటంటే, ఎస్ఐపీకి అత్యంత ముఖ్యం మొదటి నుంచే భారీ మొత్తాలను పెట్టుబడి పెట్టడం కాదు. క్రమశిక్షణతో సుదీర్ఘకాలం పాటు క్రమం తప్పకుండా పెట్టుబడిని కొనసాగించడమే కీలకం. నేడు మీ వద్ద పెద్ద మొత్తం లేకపోయినా చిన్న మొత్తంతో ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. మీ ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఎస్ఐపీ మొత్తాన్ని పెంచుకుంటూ పోతే అనుకున్న ఆర్థిక లక్ష్యాలను సులువుగా సాధించవచ్చు.

Tags: