Smoking and Insurance : ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ధూమపానం అలవాటు దాస్తే ఏమవుతుంది?
ధూమపానం అలవాటు దాస్తే ఏమవుతుంది?;
Smoking and Insurance : మన దేశంలో పొగాకు వాడకం, ముఖ్యంగా ధూమపానం ఆరోగ్యానికి చాలా పెద్ద సమస్య. భారతదేశంలో 15 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 28శాతం మందికి పైగా పొగాకును వాడతారు. క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులకు సిగరెట్ అలవాటే ప్రధాన కారణం. అందుకే, ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే, ధూమపానం చేసే వారికి రిస్క్ ఎక్కువ కాబట్టి వారి విషయంలో నియమాలు భిన్నంగా ఉంటాయి.
ధూమపానం చేసే వారికి ఎక్కువ ప్రీమియం
మీరు ధూమపానం చేసే వారైతే.. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలంటే ఎక్కువ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు, సాధారణ వ్యక్తుల కంటే రెట్టింపు ప్రీమియం కూడా కట్టమని ఇన్సూరెన్స్ కంపెనీలు అడుగుతాయి. ఎందుకంటే, ధూమపానం చేసే వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలకు రిస్క్ పెరుగుతుంది. ఈ రిస్క్‌ను కవర్ చేయడానికి వారు ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తారు.
పాలసీ తీసుకున్నాక ధూమపానం మానేస్తే?
ఒకవేళ మీరు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత ధూమపానం మానేస్తే మీ ప్రీమియంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఎందుకంటే, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఒక్కసారి ఫిక్స్ చేస్తే, పాలసీ కాలం ముగిసే వరకు అది మారదు. కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కొంచెం వెసులుబాటు ఉంది. మీరు వరుసగా 12 నుంచి 24 నెలల పాటు పొగాకును వాడకుండా ఉంటే దానికి సంబంధించిన మెడికల్ ప్రూఫ్ ఇవ్వాలి. తదుపరి పాలసీ రెన్యువల్ సమయంలో ఈ డాక్యుమెంట్స్ సమర్పిస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు మిమ్మల్ని 'నాన్-స్మోకర్'గా పరిగణించి మీ ప్రీమియాన్ని తగ్గిస్తాయి. ఇది ధూమపానం మానేసే వారికి ఒక ప్రోత్సాహం.
ధూమపానం అలవాటు దాచిపెట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటే?
ధూమపానం అలవాటు ఉన్నా, ఆ విషయాన్ని దాచిపెట్టి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే, భవిష్యత్తులో పెద్ద సమస్యలు ఎదురవుతాయి.
మెడికల్ టెస్ట్‌లు: చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ ఇచ్చే ముందు మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తాయి. ఈ టెస్ట్‌లలో వ్యక్తి రక్తం, మూత్రం, లాలాజలం లేదా జుట్టును పరీక్షించి నికోటిన్ (Nicotine) ఉందో లేదో తెలుసుకుంటాయి. ఈ టెస్ట్‌లు మీరు ధూమపానం చేస్తారా లేదా అని స్పష్టంగా చెబుతాయి.
క్లెయిమ్ తిరస్కరణ: ఒకవేళ మెడికల్ టెస్ట్‌లు లేకుండానే పాలసీ తీసుకున్నా భవిష్యత్తులో ఆ వ్యక్తి ఊపిరితిత్తులు, గుండె లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో మరణించినా లేదా ఆసుపత్రిలో చేరినా, ఆ సమస్యకు పొగాకు వాడకం కారణమా అని ఇన్సూరెన్స్ కంపెనీలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఆ సమయంలో పాలసీదారుడు ధూమపానం చేసేవాడని తెలిస్తే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు. అంటే, మీకు ఇన్సూరెన్స్ డబ్బులు రాకపోవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ, మీరు సమాచారాన్ని దాచిపెట్టారని భావించి, పాలసీని రద్దు చేసే అవకాశం ఉంటుంది.
అందుకే, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి సమాచారాన్ని దాచకుండా నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం. ఇది భవిష్యత్తులో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లకు ఎలాంటి అడ్డంకులు రాకుండా చూస్తుంది.