Fuel Crisis : వారానికి 4 రోజులే ఆఫీసులు.. ఇంధనం ఆదా చేసేందుకు లంక సర్కార్ సంచలన నిర్ణయం

ఇంధనం ఆదా చేసేందుకు లంక సర్కార్ సంచలన నిర్ణయం

Update: 2026-03-18 06:59 GMT

Fuel Crisis : మధ్యప్రాచ్యంలో చెలరేగుతున్న యుద్ధ జ్వాలలు పొరుగు దేశమైన శ్రీలంకను తీవ్రంగా వణికిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మూడో వారానికి చేరుకోవడంతో, ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ దాదాపుగా మూసివేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్త చమురు సరఫరాలో 20 శాతం నిలిచిపోయింది. ఈ ప్రభావంతో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు శ్రీలంక ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పని చేస్తాయని ఎసెన్షియల్ సర్వీసెస్ కమిషనర్ జనరల్ ప్రభాత్ చంద్రకీర్తి ప్రకటించారు. ఈ నిబంధనలు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు కూడా వర్తిస్తాయని, ఇది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు.

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశానాయకే అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. "మనం అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆస్పత్రులు, రేవులు, అత్యవసర సేవలు మాత్రమే యథావిధిగా కొనసాగుతాయని, మిగిలిన అన్ని ప్రభుత్వ వేడుకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సాధ్యమైనంత వరకు ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని, ప్రైవేట్ సంస్థలు కూడా బుధవారం సెలవు ప్రకటించి సహకరించాలని ప్రభుత్వం కోరింది. శ్రీలంక తన చమురు అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.

ఇంధన వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన ప్రకారం.. ప్రతి వాహనదారుడికి వారానికి కేవలం 15 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ మాత్రమే ఇస్తారు. అయితే ప్రజా రవాణా (బస్సులు వంటివి) కోసం 200 లీటర్ల వరకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న చమురు నిల్వలు మరో ఆరు వారాల వరకు మాత్రమే సరిపోతాయని అధికారులు లెక్కలు వేశారు. ఒకవేళ సింగపూర్, మలేషియా నుంచి వచ్చే సరఫరాలో జాప్యం జరిగితే పరిస్థితి మళ్లీ 2022 నాటి విపత్కర పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉంది.

2022లో శ్రీలంక ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం మనందరికీ తెలిసిందే. అప్పట్లో విదేశీ మారక నిల్వలు నిండుకోవడంతో 46 బిలియన్ డాలర్ల రుణాన్ని తీర్చలేక దేశం దివాలా తీసింది. ఆ తర్వాత ఐఎంఎఫ్ నుంచి 2.9 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని పొంది ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే ఇప్పుడు మళ్లీ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగినా లేదా సరఫరా ఆగినా, ఆ దేశ ఆర్థిక పురోగతి మళ్లీ కుదేలయ్యే అవకాశం ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే సామాన్యుడి బతుకు భారమై, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News