Stock Market: షేర్ మార్కెట్‌ను వణికించిన ద్రవ్యోల్బణం.. కేవలం 7 నిమిషాల్లో రూ.2.83 లక్షల కోట్ల నష్టం
రూ.2.83 లక్షల కోట్ల నష్టం
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ఉదయం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దాదాపు రెండేళ్ల తర్వాత ద్రవ్యోల్బణం రేటు 6 శాతం ఎగబాకడం, బాంకింగ్ అలాగే ఫైనాన్షియల్ రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు ఒత్తిడి పెరగడంతో మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పతనమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా సుమారు 225 పాయింట్లు నష్టపోయింది. ఈ ఆకస్మిక క్షీణత కారణంగా దేశీయ మదుపర్లు కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల సంపదను కోల్పోవాల్సి వచ్చింది.
కేవలం 7 నిమిషాల్లో రూ.2.83 లక్షల కోట్ల నష్టం
మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఏర్పడిన అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ట్రేడింగ్ ప్రారంభ సమయంలో రూ.5,12,27,177.05 కోట్ల నుంచి క్షణాల్లో రూ.5,09,44,186.57 కోట్లకు పడిపోయింది. అంటే సరిగ్గా ఏడు నిమిషాల వ్యవధిలోనే మదుపర్ల సంపద ఏకంగా రూ.2,82,990.48 కోట్లు ఆవిరైపోయింది. ఆ తర్వాత కొంత సేపటికి మార్కెట్ కోలుకునే ప్రయత్నం చేసినప్పటికీ, ఉదయం పూట జరిగిన ఈ భారీ నష్టం ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
బ్యాంకింగ్ షేర్ల పతనం
ఈ పతనంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ఎస్‌బీఐ షేర్లు కూడా భారీ లూజర్లుగా నిలిచాయి. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రूड ఆయిల్ ధరలు మళ్లీ 95 డాలర్ల సమీపానికి ఎగబాకడం మార్కెట్‌ను మరింత భయపెడుతోంది. అమెరికా అలాగే ఇరాన్ దేశాల మధ్య పూర్తిస్థాయి శాంతి ఒప్పందాలు కుదరకపోవడం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ అస్థిరత ముడి చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఐటీ షేర్ల అండతో కొంత కోలుకున్న సూచీలు
మార్కెట్ ఆరంభంలో భారీ పతనాన్ని చవిచూసినప్పటికీ, టెక్నాలజీ షేర్లు మాత్రం కొంతవరకు మార్కెట్‌ను ఆదుకున్నాయి. హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజాల షేర్లు గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతూ ఇన్వెస్టర్లకు కాస్త ఊరటనిచ్చాయి. ఉదయం 9:45 గంటల సమయానికి సెన్సెక్స్ నష్టాన్ని కొంత తగ్గించుకుని సుమారు 240 పాయింట్ల నష్టంతో 81,670 మార్కు వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 25,200 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ద్రవ్యోల్బణ భయాలు అలాగే గ్లోబల్ సంకేతాల కారణంగా రాబోయే రోజుల్లో మార్కెట్ మరింత అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది.