Totapuri Mango : తోతాపూరి మామిడి రైతులకు తీపిక‌బురు

క్వింటాకు రూ.1,490 మద్దతు ధర ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం;

Update: 2025-07-22 07:30 GMT
  • 50:50 నిష్ప‌త్తిలో కేంద్రం, ఏపీ రాష్ట్రం మ‌ద్ధ‌తు ధ‌ర‌ను చెల్లించ‌నున్నాయి
  • నేరుగా రైతుల ఖాతాల్లో జ‌మ కానున్న న‌గ‌దు

తోతాపూరి మామిడి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ సంవ‌త్స‌రం అత్య‌ధిక దిగుబ‌డి రావ‌డంతో మామిడి ధ‌ర త‌గ్గుముఖం ప‌ట్టింది. దిగుబ‌డి ఎక్కువ ఉండ‌టంతో మామిడి పంట‌ను ప‌ల్ప్ ఫ్యాక్ట‌రీలు చాలా త‌క్కువ ధ‌ర‌ చెల్లించడానికి ముందుకు వచ్చారు. దీంతో మామిడి రైతులు తమ పంటను రోడ్ల మీద పారబోసి నిరసన వ్యక్తం చేశారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మామిడి మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌ల్ప్ ఫ్యాక్టరీలు కేజీ మామిడిని 8 రూ కొనాల‌ని, 4 రూ స‌బ్సిడీ రాష్ట్ర ప్ర‌భుత్వం అంద‌చేస్తుంద‌ని తెలిపారు. కేజీ 12 రూ చొప్పున రైతుల‌కు అంద‌చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకున్నారు. అంతేకాకుండా మంత్రివర్గం ఆమోదంతో మామిడి రైతుల కోసం 246 కోట్ల రూపాయలను విడుదల చేశారు. దీంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కూడా ఏపీలో తోతాపురి మామిడి రైతుల పరిస్ధితి వివరించి ఆదుకోవాలని అభ్యర్ధించారు. స‌బ్సీడి న‌గ‌దులో 50:50 నిష్ప‌త్తిలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు న‌గ‌దును చెల్లించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

మంత్రి అచ్చెన్నాయుడు అభ్య‌ర్ధ‌న‌ని ప‌రిశీలించిన కేంద్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం తోతాపూరి మామిడి క్వింటాకు రూ.1,490 ఇస్తామని ప్ర‌క‌టించింది. 50:50 నిష్ప‌త్తిలో కేంద్రం, ఏపీ రాష్ట్రం మ‌ద్ధ‌తు ధ‌ర‌ను చెల్లించ‌నున్నాయి. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో న‌గ‌దు జమ కానుంది. ఈ విష‌యం ప‌ట్ల తోతాపూరి మామిడి రైతులు ఆనందం వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

తోతాపూరి మామిడి క్వింటాకు రూ.1,490 ను కేంద్రం ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. మామిడి రైతుల న‌ష్టం రాకూడ‌ద‌ని ముందుగానే గ్ర‌హించి కేజీ మామిడిని 12 రూ ల‌కు కొనుగొలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా కేజీ మామిడికి 4 రూ స‌బ్సిడీ ని అంద‌చేశామ‌ని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన ధరను మామిడి రైతులకు ఏపీ ప్రభుత్వం అందచేసిందని తెలిపారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎం చంద్రబాబునాయుడు , కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ లకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:    

Similar News