Swiggy : ఫుడ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. స్విగ్గీ, జొమాటో ప్లాట్‌ఫాం ఫీజు భారీగా పెంపు

స్విగ్గీ, జొమాటో ప్లాట్‌ఫాం ఫీజు భారీగా పెంపు

Update: 2026-03-25 08:10 GMT

Swiggy : మీరు ఆన్‌లైన్‌లో తరచూ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? స్విగ్గీ, జొమాటో యాప్‌లే మీ ఆకలి తీరుస్తున్నాయా? అయితే మీ జేబుకు చిల్లు పడక తప్పదు. ఇప్పటికే పెరిగిన వంట గ్యాస్, నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై ఈ ఫుడ్ డెలివరీ దిగ్గజాలు మరో బాంబు పేల్చాయి. ఒక్కో ఆర్డర్‌పై వసూలు చేసే ప్లాట్‌ఫాం ఫీజును భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల మీరు ఆర్డర్ చేసే ప్రతిసారీ అదనపు భారం పడనుంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన ప్లాట్‌ఫాం ఫీజును ఏకంగా 17 శాతం పెంచింది. ఇప్పటివరకు ఒక్కో ఆర్డర్‌పై రూ.14.99 వసూలు చేస్తుండగా, ఇప్పుడు దానిని రూ.17.58 (GSTతో కలిపి) కి పెంచేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఈ ఫీజును 20 శాతం పెంచిన కంపెనీ, ఆరు నెలలు కూడా గడవకముందే మళ్ళీ భారం మోపడం గమనార్హం. ప్లాట్‌ఫాం నిర్వహణ మరియు మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తన యూజర్లకు వివరణ ఇస్తోంది. అయితే, ఇది కేవలం ఒక్కసారి కట్టేది కాదు.. మీరు ఎన్నిసార్లు ఆర్డర్ చేస్తే అన్నిసార్లు ఈ పెరిగిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

జొమాటో కూడా తగ్గట్లేదు

స్విగ్గీ బాటలోనే తన ప్రధాన ప్రత్యర్థి జొమాటో కూడా పయనిస్తోంది. జొమాటో తన ప్లాట్‌ఫాం ఫీజును రూ.12.50 నుంచి రూ.14.90కి పెంచింది. దీనికి జీఎస్టీ కలిపితే దాదాపు స్విగ్గీ వసూలు చేస్తున్న రూ.17.58 దగ్గరకే బిల్లు చేరుతోంది. విచిత్రమేమిటంటే, ఈ రెండు కంపెనీలు దాదాపు ఒకే సమయంలో ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం. దీనివల్ల కస్టమర్లకు ఒక యాప్ కాకపోతే మరో యాప్‌లో తక్కువ ధర దొరుకుతుందన్న ఆశ కూడా లేకుండా పోయింది. ఈ ప్లాట్‌ఫాం ఫీజు అనేది కస్టమర్లు తీసుకునే ఫుడ్ విలువతో సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్‌పై సమానంగా పడుతుంది.

మొత్తం భారం కస్టమర్లపైనే

మొదట్లో ఫ్రీ డెలివరీ, భారీ డిస్కౌంట్లతో అలవాటు చేసిన ఈ కంపెనీలు.. ఇప్పుడు మెల్లమెల్లగా ఛార్జీల బాదుడు మొదలుపెట్టాయి. ముందుగా రూ.2తో మొదలైన ఈ ప్లాట్‌ఫాం ఫీజు.. ఇప్పుడు ఏకంగా రూ.17 దాటేసింది. అంటే మీరు రూ.100 విలువైన ఫుడ్ ఆర్డర్ చేసినా, దానికి డెలివరీ ఛార్జీలు, జీఎస్టీ, ఈ ప్లాట్‌ఫాం ఫీజు అన్నీ కలిపి బిల్లు రూ.150 దాటిపోతోంది. రాష్ట్ర ఎన్నికలు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల తమ లాభాలు తగ్గుతున్నాయని, వాటిని పూడ్చుకోవడానికే ఇలా ధరలు పెంచుతున్నామని మేనేజ్‌మెంట్ చెబుతోంది.

ఇన్వెస్టర్ల కోసం.. కస్టమర్ల బలి

స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఈ కంపెనీలు లాభాల బాట పట్టడంపైనే దృష్టి పెట్టాయి. గతంలో కేవలం ఆర్డర్ వాల్యూ పెంచడంపై ఫోకస్ చేసిన సంస్థలు, ఇప్పుడు ప్రతి ఆర్డర్ ద్వారా అదనపు ఆదాయం రాబట్టాలని చూస్తున్నాయి. అయితే ఈ ప్లాట్‌ఫాం ఫీజు పెంపు అనేది కేవలం ఫుడ్ ఆర్డర్లకే పరిమితం కాలేదు. స్విగ్గీ ఇన్స్టామార్ట్, జొమాటో బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ ఆర్డర్ల పైన కూడా ఈ ఛార్జీల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేయడం ఇప్పుడు విలాసవంతంగా మారిపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News