Tax Audit Report : పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట.. అందుకు గడువు అక్టోబర్ 31వరకు పొడగింపు

అందుకు గడువు అక్టోబర్ 31వరకు పొడగింపు

Update: 2025-09-26 05:20 GMT

Tax Audit Report : పన్ను చెల్లింపుదారులకు, ప్రాక్టీషనర్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నుండి ఒక శుభవార్త అందింది. టాక్స్ ఆడిట్ రిపోర్టులను సమర్పించడానికి చివరి తేదీని సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 31 వరకు ఒక నెల పాటు పొడిగించారు. ఆదాయపు పన్నుల చట్టాలను పర్యవేక్షించే సీబీడీటీ, రాజస్థాన్ హైకోర్టు, కర్ణాటక హైకోర్టుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు హైకోర్టులు టాక్స్ ఆడిట్ రిపోర్టుల సమర్పణ గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించాలని సీబీడీటీని ఆదేశించాయి.

పన్ను చెల్లింపుదారులు, ప్రాక్టీషనర్లకు ఆడిట్ రిపోర్టులను సకాలంలో పూర్తి చేయడంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని వివిధ సంఘాలు, ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలు సీబీడీటీని సంప్రదించాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలలో సంభవించిన వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల కారణంగా వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల ఆడిట్ ప్రక్రియ ఆలస్యమైందని ఈ సంఘాలు వాదించాయి.

సీబీడీటీకి వినతులు పంపడమే కాకుండా, ఈ విషయం వివిధ హైకోర్టులలో కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్, కర్ణాటక హైకోర్టులు తీర్పునిచ్చి, గడువును పొడిగించాలని సీబీడీటీకి ఆదేశాలు జారీ చేశాయి. దీనితో సీబీడీటీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది నుండి ఇన్‌కమ్ టాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్ సరిగా పనిచేయడం లేదని వచ్చిన వార్తలను సీబీడీటీ ఖండించింది. పోర్టల్‌లో ఎటువంటి సాంకేతిక లోపాలు లేవని, టాక్స్ ఆడిట్ రిపోర్టులు సజావుగా అప్‌లోడ్ అవుతున్నాయని సీబీడీటీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 24న ఒక్కరోజే 60,000 కు పైగా టాక్స్ ఆడిట్ రిపోర్టులు అప్‌లోడ్ అయ్యాయని సీబీడీటీ తెలిపింది. ఇప్పటివరకు అప్‌లోడ్ అయిన మొత్తం TAR ల సంఖ్య 4 లక్షలకు పైగా ఉందని పేర్కొంది. ఇదే సమయంలో, సెప్టెంబర్ 23 వరకు సమర్పించిన ఐటీ రిటర్న్‌ల సంఖ్య 7.57 కోట్లకు పైగా ఉందని వెల్లడించింది. ఈ గడువు పొడిగింపు వల్ల ఇంకా రిపోర్టులు సమర్పించని వారికి, ప్రకృతి విపత్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ఉపశమనం లభించనుంది. పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో తమ రిపోర్టులను సమర్పించాలని సీబీడీటీ సూచించింది.

Tags:    

Similar News