TCS Job Offers : ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్.. ఈ ఏడాది 25,000 మందికి ఉద్యోగాలు
ఈ ఏడాది 25,000 మందికి ఉద్యోగాలు
TCS Job Offers : దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నిరుద్యోగులకు, ముఖ్యంగా ఫ్రెషర్లకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం కంపెనీ ఇప్పటివరకు 25,000 మంది ఫ్రెషర్లకు జాబ్ ఆఫర్లు ఇచ్చినట్లు ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య కొంత తక్కువగా అనిపించినప్పటికీ, వ్యాపార అవసరాలను బట్టి భవిష్యత్తులో మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశం ఉందని కంపెనీ స్పష్టం చేసింది.
నియామకాల సంఖ్య ఎందుకు తగ్గింది?
గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ ఏకంగా 44,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. అయితే, ఈసారి ఆ సంఖ్య 25,000కు తగ్గడం వెనుక కంపెనీ వ్యూహాత్మక నిర్ణయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, క్లయింట్ల ఖర్చు తగ్గించుకోవడం వంటి కారణాల వల్ల టీసీఎస్ నియామకాల్లో కొంత జాగ్రత్త వహిస్తోంది. అయితే బిజినెస్ డిమాండ్ పెరిగే కొద్దీ ఈ సంఖ్యను పెంచుతామని కంపెనీ సీఈఓ, ఎండీ కె.కృతివాసన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్తవారిని తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఫ్రెషర్లు వర్సెస్ సీనియర్లు
నియామకాల విషయంలో టీసీఎస్ తన పాత పద్ధతికే కట్టుబడి ఉందని కంపెనీ వెల్లడించింది. సాధారణంగా ఫ్రెషర్లను తీసుకున్నప్పుడు వారికి ప్రాజెక్టుల్లోకి పంపే ముందు 6 నుంచి 9 నెలల పాటు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అదే అనుభవం ఉన్న వారైతే వెంటనే పని మొదలుపెట్టగలరు. అందుకే వ్యాపార అవసరాలు అత్యవసరంగా ఉన్నప్పుడు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తుంటామని, అయినప్పటికీ ఫ్రెషర్లను తీసుకోవడం ఎప్పటికీ ఆపమని కంపెనీ క్లారిటీ ఇచ్చింది.
ఏఐ ప్రభావం, లే-ఆఫ్స్ పై స్పష్టత
గత ఏడాది టీసీఎస్ సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో ఎక్కువ మంది సీనియర్ లెవల్ ఉద్యోగులే ఉన్నారు. అయితే, ఈ తొలగింపులకు కృత్రిమ మేధకు ఎటువంటి సంబంధం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ప్రాజెక్టులు పూర్తి చేసే విధానంలో వస్తున్న మార్పుల వల్ల మధ్యస్థ, సీనియర్ స్థాయిలో ఎక్కువ మంది అవసరం లేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రతిభ కనబరిచే ఉద్యోగులకు టీసీఎస్ లో సుదీర్ఘమైన, స్థిరమైన కెరీర్ ఉంటుందని కృతివాసన్ భరోసా ఇచ్చారు.
భవిష్యత్తు ప్రణాళికలు
ప్రస్తుతానికి టీసీఎస్ చేతిలో ప్రాజెక్టుల పైప్‌లైన్ బలంగా ఉంది. గత ఏడాది కంపెనీ సుమారు 40 బిలియన్ డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులపై సంతకాలు చేసింది. ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కితే కంపెనీ ఆదాయం పెరగడమే కాకుండా మరిన్ని ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి విభాగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని, ఇది సానుకూల సంకేతమని కంపెనీ పేర్కొంది.