EPFO : ఈపీఎఫ్‌ఓ చందాదారులకు అలర్ట్.. నిలిచిపోనున్న ఈపీఎఫ్ ఆన్‌లైన్ సేవలు
నిలిచిపోనున్న ఈపీఎఫ్ ఆన్‌లైన్ సేవలు
EPFO : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులకు, యజమానులకు ముఖ్యమైన సమాచారం అందించింది. ప్లాట్‌ఫామ్ పనితీరును, వేగాన్ని, భద్రతను మరింత పెంచే లక్ష్యంతో సిస్టమ్ అప్‌గ్రేడేషన్ పనులు చేపడుతున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఈరోజు అంటే బుధవారం, ఆగస్ట్ 5వ తేదీ సాయంత్రం వేళ ఈపీఎఫ్‌ఓకు చెందిన ఈ-ఆఫీస్ అప్లికేషన్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నాయి. ఈ నిర్ణీత సమయంలో యూజర్లకు ఆన్‌లైన్ సేవల్లో స్వల్ప అంతరాయం లేదా ఆలస్యం ఎదురయ్యే అవకాశముందని అధికారులు ముందస్తుగా స్పష్టం చేశారు.
ఏ సమయంలో సేవల నిలిపివేత.. కారణం ఏమిటి?
ఈపీఎఫ్‌ఓ అధికారిక ప్రకటన ప్రకారం.. బుధవారం సాయంత్రం 6:00 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఈ-ఆఫీస్ అప్లికేషన్ సేవలు పూర్తిగా అందుబాటులో ఉండవు. ఈ మూడున్నర గంటల వ్యవధిలో ప్లాట్‌ఫామ్‌లోని పలు మెయిన్ టెక్నికల్ వర్షన్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. వీటిలో ఈ-ఫైల్ వర్షన్ 7.4.4-3, పోర్టల్ వర్షన్ 8.2.2, ఎంఐఎస్ వర్షన్ 7.3.0, ఎమ్ డి ఎమ్ వర్షన్ 7.3.1-1 అప్‌గ్రేడేషన్‌లు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్ డిజిటల్ సర్వీసులను మరింత వేగవంతంగా, సురక్షితంగా మార్చడానికే ఈ షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ నిర్వహిస్తున్నారు.
చందాదారులపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది?
ఈ తాత్కాలిక నిలిపివేత ప్రభావం ప్రధానంగా ఈపీఎఫ్‌ఓ అంతర్గత ఈ-ఆఫీస్ అప్లికేషన్‌పైనే ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. అయితే చందాదారులు మరియు యజమానులు తమ ఆన్‌లైన్ పనులను ఈ సమయానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ఇటీవలే పూర్తి చేసిన డేటాబేస్ ఏకీకరణ, సాఫ్ట్‌వేర్ మైగ్రేషన్ ప్రక్రియల తర్వాత ఈ అప్‌గ్రేడ్ చేపడుతున్నారు. ప్రస్తుతం పిఎఫ్ క్లెయిమ్‌లు, విజ్ఞప్తులను అదనపు వెరిఫికేషన్ చెక్‌ల ద్వారా ప్రాసెస్ చేస్తుండటం వల్ల ఆన్‌లైన్ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌కు కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశముంది.
ఉమాంగ్ యాప్ సేవలు అందుబాటులోనే
ఈ-ఆఫీస్ అప్లికేషన్ అప్‌గ్రేడ్ అవుతున్నప్పటికీ చందాదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉమాంగ్ యాప్ ద్వారా కొన్ని సేవలను దశలవారీగా పునరుద్ధరించినట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది. ప్రసుతం ఉమాంగ్ యాప్ ద్వారా యుఏఎన్ కేటాయింపు, యాక్టివేషన్, ఫేస్ అథెంటికేషన్, ఎస్ఎమ్ఎస్, మిస్డ్ కాల్ ద్వారా అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. సర్వర్లపై అనవసర లోడ్ పడకుండా ఉండేందుకు యూజర్లు పీక్ అవర్స్‌లో పదే పదే లాగిన్ చేయడం లేదా ఒకే విజ్ఞప్తిని పలుమార్లు సబ్మిట్ చేయడం చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.