Anil Ambani : అనిల్ అంబానీకి కొత్త చిక్కులు.. రిలయన్స్ గ్రూప్‌పై రంగంలోకి ప్రభుత్వం
రిలయన్స్ గ్రూప్‌పై రంగంలోకి ప్రభుత్వం
Anil Ambani : బ్యాంకు రుణాల మోసాల కేసులో ఇరుక్కున్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఈడీ, సీబీఐ, సెబీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలు కొనసాగుతుండగా, తాజాగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది. నిధుల దుర్వినియోగం, మళ్లింపు ఆరోపణలపై మంత్రిత్వ శాఖ గ్రూప్‌లోని పలు కంపెనీలపై కొత్త విచారణను ప్రారంభించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును అత్యంత కీలకమైన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌కు అప్పగించారు.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీల్లో నిధుల దుర్వినియోగం, భారీ ఎత్తున నిధులు మళ్లించారనే ఆరోపణలపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త విచారణకు ఆదేశించింది. ఈ విచారణ పరిధిలోకి రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, సీఎల్‌ఈ ప్రైవేట్ లిమిటెడ్ వంటి గ్రూప్ కంపెనీలు వస్తాయి.
మంత్రిత్వ శాఖ ప్రాథమిక దర్యాప్తులో కంపెనీల చట్టం కింద తీవ్రమైన అవకతవకలు, నిధులు దుర్వినియోగం జరిగినట్లు సంకేతాలు కనిపించడంతో, ఈ కేసును సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌కు అప్పగించడం జరిగింది. ఎంసీఏ విచారణ ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రిలయన్స్ గ్రూప్‌పై తన చర్యలను వేగవంతం చేసింది. ఈ వారం ప్రారంభంలో, ఈడీ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన సుమారు రూ.7,500 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.
ఈ ఆస్తులలో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన 30 స్థిరాస్తులు, అదర్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ, మోహన్‌బిర్ హై-టెక్ బిల్డ్, గేమెసా ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ వంటి ఇతర అనుబంధ సంస్థలకు చెందిన ఆస్తులు ఉన్నాయి. ఈ జప్తులు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన బహుళ-కోట్ల బ్యాంకు మోసం కేసుతో సంబంధం కలిగి ఉన్నాయని ఈడీ పేర్కొంది.
ఈడీ కేసు ముఖ్యంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని అనుబంధ సంస్థలు 2010 నుంచి 2012 మధ్య తీసుకున్న రుణాలపై దృష్టి సారించింది. ఈ కంపెనీలు తీసుకున్న మొత్తం రుణం రూ.40,185 కోట్లు అని, వీటిలో ఐదు బ్యాంకులు ఈ రుణ ఖాతాలను ఫ్రాడ్‌గా ప్రకటించాయని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. దర్యాప్తు అధికారులు నిధులు గ్రూప్‌లోని ఇతర యూనిట్‌లకు మళ్లించబడి, సంబంధిత కంపెనీలకు బదిలీ చేయబడి, పాత అప్పులను తీర్చడానికి ఉపయోగించారని ఆరోపిస్తున్నారు. ఇది రుణ నిబంధనలను ఉల్లంఘించడమే.
వ్యాపార కార్యకలాపాల కోసం తీసుకున్న డబ్బును ఎవర్‌గ్రీనింగ్ ఆఫ్ డెట్ అంటే, కొత్త రుణాలు తీసుకుని పాత రుణాలను చెల్లించడానికి ఉపయోగించారని ఈడీ ఆరోపించింది. 2010-2012 మధ్య ఆర్కామ్ తీసుకున్న వేలాది కోట్ల రుణంలో రూ.19,694 కోట్లు ఇంకా బకాయి ఉన్నాయని, ఈ ఖాతాలను ఫ్రాడ్‌గా ప్రకటించారని ఈడీ తెలిపింది.