Gold Price Drop : 14 రోజుల్లో 58 టన్నులు ఖాళీ.. బంగారం అమ్మకాల్లో టర్కీ రికార్డు..పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ రాబోతోందా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ రాబోతోందా?

Update: 2026-03-30 09:45 GMT

Gold Price Drop : గ్లోబల్ గోల్డ్ మార్కెట్‌లో ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఉంటూనే ఉంటుంది. కానీ, తాజాగా టర్కీ దేశం తీసుకున్న నిర్ణయం ఆర్థిక నిపుణులను, ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేసింది. తన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా టర్కీ సెంట్రల్ బ్యాంక్ కేవలం 14 రోజుల్లోనే ఏకంగా 58 టన్నుల బంగారాన్ని అమ్మేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు 8 బిలియన్ డాలర్లకు పైనే (సుమారు రూ.67 వేల కోట్లు) ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తంలో పసిడిని ఒకేసారి మార్కెట్లోకి విడుదల చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలపై ఒత్తిడి పెరుగుతోంది.

రెండు వారాల్లోనే భారీ పతనం

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మార్చి 13తో ముగిసిన వారంలో 6 టన్నులు, మార్చి 20 నాటికి మరో 52.4 టన్నుల బంగారాన్ని టర్కీ విక్రయించింది. ఈ భారీ అమ్మకాల తర్వాత టర్కీ వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వలు 513 టన్నులకు పడిపోయాయి. గత ఏడేళ్లలో టర్కీ బంగారం నిల్వలు ఇంత కనిష్ట స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఇందులో సగానికి పైగా బంగారాన్ని అమెరికన్ డాలర్లను అప్పుగా తీసుకోవడానికి వాడగా, మిగిలిన దాన్ని నేరుగా ఓపెన్ మార్కెట్‌లో విక్రయించారు.

లీరాను కాపాడుకునేందుకే ఈ పాట్లు

టర్కీ ఇలా బంగారాన్ని వదిలించుకోవడానికి ప్రధాన కారణం ఆ దేశ కరెన్సీ లీరా విలువ పడిపోవడమే. పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా ఇంధన దిగుమతుల ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో మార్కెట్‌లో అమెరికన్ డాలర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి, మార్కెట్‌లో నగదు లభ్యతను పెంచడానికి టర్కీ తన విదేశీ మార్పిడి నిల్వలను వాడాల్సి వస్తోంది. ప్రస్తుతం టర్కీ విదేశీ మారకద్రవ్య నిల్వలు 175 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది 2025 మూడో త్రైమాసికం తర్వాత అత్యంత తక్కువ స్థాయి.

బంగారం ధరలు తగ్గుతాయా?

టర్కీ తీసుకున్న ఈ దూకుడు చర్య అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. సాధారణంగా మార్కెట్లోకి సప్లై పెరిగినప్పుడు ధరలు తగ్గడం సహజం. లండన్ మార్కెట్‌లో జరిగిన ఈ భారీ డీల్స్ తర్వాత స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక దశలో 3.1 శాతం వరకు పడిపోయి, ఆ తర్వాత 2.4 శాతం నష్టంతో ముగిశాయి. సామాన్య ఇన్వెస్టర్లు, కొనుగోలుదారులు అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఇంధన సంక్షోభం ఇలాగే కొనసాగితే, టర్కీ మరిన్ని నిల్వలను విక్రయించే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు మరింత దిగివచ్చే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News