Jio: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో టెలికాం దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి దూకుడు ప్రదర్శిస్తున్న జియో షేర్లు, రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించాయి. మార్కెట్ ప్రారంభమైన అతి కొద్ది నిమిషాల్లోనే కంపెనీ షేరు ధర రికార్డు స్థాయికి దూసుకెళ్లింది. ఈ ఒక్క పరిణామంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరగడమే కాకుండా, కంపెనీ మార్కెట్ విలువ నిమిషాల వ్యవధిలోనే వేల కోట్లు పుంజుకుంది. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కే గట్టి పోటీ ఇస్తూ జియో దూసుకుపోతున్న తీరు దేశవ్యాప్తంగా ట్రేడింగ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రికార్డు స్థాయికి జియో షేర్లు

షేర్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు 5 శాతానికి పైగా లాభపడి సరికొత్త రికార్డు సృష్టించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ షేరు ధర ఏకంగా రూ. 1,490 గరిష్ట స్థాయిని తాకింది. కంపెనీ ఇష్యూ ధరతో పోలిస్తే ఇది 33 శాతానికి పైగా లాభం కావడం విశేషం. నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో జియో షేర్లు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. మార్కెట్లో చిన్న, పెద్ద ఇన్వెస్టర్లు అందరూ ఈ కౌంటర్ వైపు మొగ్గు చూపుతుండటంతో ట్రేడింగ్ వాల్యూమ్ విపరీతంగా పెరిగింది.

నిమిషాల్లోనే రూ.67 వేల కోట్ల సంపద సృష్టి

షేర్ ధర ఒక్కసారిగా ఎగబాకడంతో జియో మార్కెట్ క్యాపిటలైజేషన్ అమాంతం పెరిగింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కంపెనీ వ్యాల్యూయేషన్ ఏకంగా రూ.67,213 కోట్లు పెరిగి రూ.13,73,974 కోట్లకు చేరుకుంది. ఒక రోజు ముందే మార్కెట్ ముగిసే సమయానికి రూ.13.06 లక్షల కోట్లుగా ఉన్న కంపెనీ విలువ, ఈ ఉదయం పూట క్షణాల వ్యవధిలోనే భారీ వృద్ధిని నమోదు చేసింది. ఈ దూకుడు చూస్తుంటే మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డులను కూడా జియో అధిగమించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రిలయన్స్‌కు చెక్ పెడుతుందా?

ప్రస్తుత మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.15.91 లక్షల కోట్లుగా ఉంది. జియో ప్లాట్‌ఫామ్స్ మార్కెట్ విలువ రూ.13.73 లక్షల కోట్లకు చేరడంతో, రెండు కంపెనీల మధ్య వ్యత్యాసం కేవలం రూ.2.41 లక్షల కోట్లకు మాత్రమే పరిమితమైంది. జియో షేర్లు ఇదే వేగంతో పరుగులు పెడితే దేశంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన నంబర్-1 కంపెనీగా రిలయన్స్ స్థానాన్ని జియో కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. టెలికాం, డిజిటల్ రంగంలో జియో సాధిస్తున్న విజయాలే ఈ అద్భుతమైన వృద్ధికి ప్రధాన కారణం.

Tags: