UPI : ఒక్కసారి ఊహించుకోండి.. మీరు మీ మొబైల్‌లోని ఏఐ అసిస్టెంట్‌తో వచ్చే మంగళవారం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని చెప్పారు. అప్పుడు ఆ ఏఐ కేవలం మీకు ఫ్లైట్ ఆప్షన్లను చూపించడమే కాదు.. అందులో అన్నింటికంటే తక్కువ ధర ఉన్న బెస్ట్ ఫ్లైట్‌ను సెలెక్ట్ చేసి, మీ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ఫిల్ చేసి, మీ తరపున పేమెంట్ కూడా పూర్తి చేస్తుంది. మీరు ఎలాంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండా, యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండానే ఈ పనులన్నీ కేవలం మీ వాయిస్ కమాండ్‌తో జరిగిపోతాయి. ప్రస్తుతం వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపించినా, రాబోయే రోజుల్లో ఇది నిజం కాబోతోంది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇలాంటి ఒక సరికొత్త విప్లవాత్మక సిస్టమ్‌పై వేగంగా పనిచేస్తోంది. దీనికి యూనిఫైడ్ ఏజెంట్ ప్రోటోకాల్ అని పేరు పెట్టారు.

ఏఐ ప్రస్తుతం నేరుగా పేమెంట్స్ ఎందుకు చేయలేదు?

ప్రస్తుత రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు లేదా అసిస్టెంట్లు మనకు నచ్చిన వస్తువులను ఆన్‌లైన్‌లో వెతకడానికి, వాటి ధరలను పోల్చడానికి, మంచి సలహాలు ఇవ్వడానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. కానీ, ఎప్పుడైతే యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి వస్తుందో, అక్కడ ఈ ప్రాసెస్ ఆగిపోతుంది. ఎందుకంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం కేవలం ఒక వ్యక్తి లేదా రిజిస్టర్డ్ పేమెంట్ యాప్స్ మాత్రమే యూపీఐ లావాదేవీలు చేయడానికి అర్హులు, ఏఐ ఏజెంట్లకు ఆ పర్మిషన్ లేదు. నిజానికి యూపీఐలో ఇప్పటికే ఆటో-పే, రిజర్వ్ పే వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటి ద్వారా నెట్‌ఫ్లిక్స్ వంటి సబ్‌స్క్రిప్షన్ల కోసం యూజర్లు ఒక పరిమితిని సెట్ చేసి, ఒకసారి పిన్ ఎంటర్ చేస్తే ప్రతి నెల డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. అయితే, ఇది ఏఐ ఏజెంట్లు సొంతంగా మార్కెట్లో నిర్ణయాలు తీసుకుని, వినియోగదారుడి తరపున స్వతంత్రంగా కొనుగోళ్లు చేయడానికి సరిపోదు. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికే NPCI యూఏపీ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకువస్తోంది.

యూనిఫైడ్ ఏజెంట్ ప్రోటోకాల్ అంటే ఏంటి?

బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. యూఏపీ అనేది ఒక నమ్మకమైన, సాధారణ, ఇంటర్‌ఆపరబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా డిజైన్ చేయబడుతోంది. దీని ద్వారా ఏఐ ఏజెంట్లను యూపీఐ ఎకోసిస్టమ్‌లో లావాదేవీలు చేయడానికి వీలుగా రిజిస్టర్ చేయడం, వెరిఫై చేయడం, వారికి అథారిటీ ఇవ్వడం సాధ్యమవుతుంది. దీనికోసం ప్రస్తుతం ఉన్న పేమెంట్ సిస్టమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఎలాంటి పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. యూఏపీ అనేది యూపీఐ స్థానాన్ని భర్తీ చేయదు, దానికి బదులుగా ప్రస్తుతం ఉన్న సిస్టమ్ పైన ఒక అదనపు వెరిఫికేషన్ లేయర్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల రిజిస్టర్డ్ ఏఐ ఏజెంట్లు వినియోగదారుడి అనుమతితోనే సురక్షితంగా యూపీఐతో కనెక్ట్ అవ్వడానికి వీలుంటుంది. ఏదైనా ఒక లావాదేవీ ప్రాసెస్ అయ్యే ముందు, ఆ ఏఐ ఏజెంట్ నిజంగానే సదరు యూజర్ అనుమతితోనే పనిచేస్తోందా లేదా అని చెక్ చేయడానికి ఈ ప్రోటోకాల్ ఉపయోగపడుతుంది.

ఈ సరికొత్త ఏఐ పేమెంట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?

ఈ సరికొత్త టెక్నాలజీ పనితీరుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉన్నప్పటికీ, ఇది ఇప్పటికే ఉన్న యూపీఐ నెట్‌వర్క్ పైనే రన్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని పేమెంట్ ప్రాసెస్ సాధారణంగా ఇలా ఉండవచ్చు: మొదట యూజర్ తన ఏఐ అసిస్టెంట్‌కు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఆ తర్వాత ఏఐ అసిస్టెంట్ ఆన్‌లైన్ మార్కెట్లోని అన్ని ఆప్షన్లను పోల్చి చూసి, బెస్ట్ ఆప్షన్‌ను ఎంచుకుని ఒక పేమెంట్ రిక్వెస్ట్‌ను క్రియేట్ చేస్తుంది. వెంటనే యూఏపీ రంగంలోకి దిగి ఆ ఏఐ ఏజెంట్ రిజిస్టర్డ్, నమ్మకమైనదేనా, దానికి యూజర్ తరపున పనిచేసే హక్కు ఉందా లేదా అని వెరిఫై చేస్తుంది. ఆ తర్వాత రిక్వెస్ట్ యూపీఐ ద్వారా పంపబడుతుంది. ఇక్కడ యూజర్ ఆ లావాదేవీని మాన్యువల్‌గా అప్రూవ్ చేయవచ్చు, లేదా ముందే సెట్ చేసుకున్న లిమిట్ లోపు ఉండే చిన్న లావాదేవీలకైతే ముందే అంగీకరించిన నిబంధనల ప్రకారం పేమెంట్ ఆటోమేటిక్‌గా పూర్తవుతుంది.

ఏఐ ఏజెంట్లకు మన బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ ఇస్తే సేఫేనా?

ఈ విధానం వల్ల ఏఐ ఏజెంట్లకు మన బ్యాంక్ ఖాతాపై అన్‌లిమిటెడ్ యాక్సెస్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. ఈ సిస్టమ్ పూర్తిగా వినియోగదారుడి నియంత్రణలోనే ఉంటుంది. ఇది ప్రస్తుత యూపీఐ ఆటో-పే లాగే పనిచేస్తుంది, అంటే యూజర్లు తమ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన పూర్తి యాక్సెస్ ఇవ్వడానికి బదులుగా, ఏఐ ఏజెంట్ ఎంతవరకు ఖర్చు చేయవచ్చనే లిమిట్ ను ముందే సెట్ చేస్తారు. ఈ ప్రతిపాదిత ప్రోటోకాల్ ద్వారా ఏఐ ఏజెంట్ అధికారాల పరిమితిని ఖచ్చితంగా నిర్దేశిస్తారు. ఒకవేళ ఆ పరిమితిని దాటి ఏఐ వ్యవహరిస్తే ఆ లావాదేవీ బ్లాక్ అవుతుంది మరియు దానికి జవాబుదారీతనం కూడా ఫిక్స్ చేయబడుతుంది. అయితే, ఈ టెక్నాలజీని మార్కెట్లోకి లాంచ్ చేయడానికి ముందు NPCI సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తుది అనుమతిని పొందాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ ఇచ్చే భద్రతా మార్గదర్శకాల ఆధారంగానే దీని తుది రూపం ఆధారపడి ఉంటుంది.

సైబర్ నేరగాళ్ల ముప్పు.. ఇదెందుకు అంత ముఖ్యం?

టెక్నాలజీ మారుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు, ఫ్రాడ్ చేసే ముఠాలు కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని కొత్త రకం మోసాలకు తెరలేపే అవకాశం ఉంది. ఏఐ అసిస్టెంట్లకు వినియోగదారుల తరపున కొనుగోళ్లు చేసే హక్కును కల్పించడం వల్ల సైబర్ సెక్యూరిటీ మరియు కస్టమర్ ప్రొటెక్షన్‌కు సంబంధించి సరికొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఈ సాంకేతికత ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున దీనివల్ల వచ్చే రిస్క్‌లను కూడా ముందే అంచనా వేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ, ఒకవేళ ఈ యూనిఫైడ్ ఏజెంట్ ప్రోటోకాల్ విజయవంతంగా అమలులోకి వస్తే.. ఏఐ ఏజెంట్ల ద్వారా అధికారికంగా డిజైన్ చేయబడిన నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కలిగిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశాలలో భారతదేశం ఒకటిగా నిలుస్తుంది. ఇది యూపీఐని మాన్యువల్ పేమెంట్ సిస్టమ్ నుండి నెక్స్ట్ జనరేషన్ ఏజెంటిక్ పేమెంట్ సిస్టమ్ గా మారుస్తుంది.

Tags: