Crude Oil : వాహనదారులకు భారీ ఊరట.. ప్రపంచవ్యాప్తంగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రపంచవ్యాప్తంగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
Crude Oil : ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ఇంధన రంగానికి అంతర్జాతీయ మార్కెట్ నుంచి అత్యంత సానుకూలమైన వార్త అందింది. గత కొంతకాలంగా ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు ఎండ్ కార్డ్ పడబోతోంది. ఇరు దేశాల మధ్య నడుస్తున్న యుద్ధ వాతావరణాన్ని ముగించడానికి ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్‌పై అమెరికా విధించిన ఆర్థిక, సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మార్గాన్ని కూడా తిరిగి తెరవడానికి ఇరు దేశాలు సమ్మతించాయి.
కుప్పకూలిన అంతర్జాతీయ ముడి చమురు ధరలు
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందనే అధికారిక వార్త బయటకు రాగానే, అంతర్జాతీయ చమురు మార్కెట్ ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని నెలలుగా సరఫరా కొరత భయాలతో ఆకాశాన్ని తాకిన ముడి చమురు ధరలు సోమవారం ఉదయం కుప్పకూలాయి. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 4 శాతం మేర క్షీణించి బ్యారెల్‌కు 84 డాలర్ల స్థాయికి పడిపోయింది. అదేవిధంగా, అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ ధర కూడా 4.6 శాతానికి పైగా తగ్గి బ్యారెల్‌కు 80 డాలర్ల వద్దకు చేరుకుంది.
హోర్ముజ్ జలమార్గం పునరుద్ధరణకు ట్రంప్ ఆదేశాలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఈ చారిత్రాత్మక పరిణామాన్ని ధృవీకరించారు. ఇరాన్ రేవులపై విధించిన అమెరికా నౌకాబందీని తక్షణమే రద్దు చేయాలని తా తాను ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకటించారు. రాబోయే శుక్రవారం నుంచి హోర్ముజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు యథావిధిగా ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఈ కీలక సముద్ర మార్గం మూతపడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తి, అన్ని దేశాలలో ద్రవ్యోల్బణం, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు సరఫరా లైన్ క్లియర్ అవ్వడంతో ముడి చమురు ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
స్విట్జర్లాండ్‌లో అధికారిక సంతకాలు
ఈ చారిత్రాత్మక శాంతి చర్చలలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ముఖ్యమైన మధ్యవర్తిగా వ్యవహరించారు. ట్రంప్, షెహబాజ్ షరీఫ్ ఇద్దరూ కూడా ఈ ఒప్పంద డ్రాఫ్ట్ విజయవంతం అయిందని ప్రకటించారు. ఈ కీలక ఒప్పందంపై రాబోయే శుక్రవారం నాడు స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధులు అధికారికంగా సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, లెబనాన్ సరిహద్దులతో పాటు అన్ని రకాల సైనిక వ్యూహాలను, ఘర్షణలను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించారు. దీనివల్ల మధ్యప్రాచ్యంలో చాన్నాళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది.
డీల్‌లోని ముఖ్యమైన నిబంధనలు ఇవే
అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఈ ప్రాథమిక ఒప్పందంలో భాగంగా అమెరికా గతంలో ఫ్రీజ్ చేసిన ఇరాన్‌కు చెందిన 25 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 2 లక్షల కోట్ల) నిధులను తిరిగి విడుదల చేయడానికి అంగీకరించింది. దీనికి బదులుగా ఇరాన్ తన వివాదాస్పద అణు కార్యక్రమాలను పరిమితం చేయడానికి, ఎలాంటి పరమాణు ఆయుధాలను తయారు చేయబోమని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం గారిబాబాది మాట్లాడుతూ.. ఈ 60 రోజుల తాత్కాలిక యుద్ధ విరామ సమయంలో ఇరు దేశాలు మరింత లోతైన విషయాలపై చర్చలు జరుపుతాయని, ఆర్థిక ఆంక్షల శాశ్వత రద్దు మరియు అణు కార్యక్రమాల భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.