Green Card: అమెరికాలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. గ్రీన్ కార్డ్ మంజూరు చేయడానికి ఎంతో కీలకమైన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్(PERM) దరఖాస్తుల స్వీకరణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వాషింగ్టన్ యంత్రాంగం ప్రకటించింది. విదేశీ ఉద్యోగులను తీసుకునే క్రమంలో వీసా నిబంధనలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలతో ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు అమెరికా యంత్రాంగం వెల్లడించింది.

ఏమిటీ పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్?

అమెరికాలోని ఏ కంపెనీ అయినా విదేశీ ఉద్యోగిని శాశ్వతంగా (గ్రీన్ కార్డ్ ద్వారా) తమ వద్ద ఉంచుకోవాలనుకుంటే కార్మిక శాఖ నుంచి పర్మ్ సర్టిఫికేషన్ పొందడం తప్పనిసరి. ఆ ప్రత్యేకమైన ఉద్యోగానికి స్థానిక అమెరికన్ పౌరులు ఎవరూ అందుబాటులో లేరని కంపెనీలు నిరూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రక్రియను ట్రంప్ యంత్రాంగం నిలిపివేయడంతో, బాధిత కంపెనీలు తమ విదేశీ ఉద్యోగుల కోసం కొత్తగా గ్రీన్ కార్డ్ దరఖాస్తులు దాఖలు చేసే అవకాశం పూర్తిగా మూసుకుపోయింది.

ప్రధాన ఐటీ దిగ్గజాలపై చర్యలు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, కార్మిక కార్యదర్శి కీత్ సోండర్లింగ్ ఈ ఆంక్షల వివరాలను బయటపెట్టారు. వీసా నిబంధనల దుర్వినియోగంలో మైక్రోసాఫ్ట్ ముందంజలో ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. కేవలం మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ టెక్, క్యాప్‌జెమిని వంటి ప్రధాన ఐటీ సేవలందించే సంస్థలన్నీ ఈ నిషేధ పరిధిలోకి వచ్చాయి. ఈ కంపెనీలన్నింటిపై అమెరికా కార్మిక శాఖ లోతైన విచారణ కూడా జరుపుతోంది.

భారతీయ ఇంజనీర్లపై తీవ్ర ప్రభావం

అమెరికా ఐటీ రంగంలో అత్యధికంగా పనిచేస్తున్న భారతీయ ప్రొఫెషనల్స్‌పై ఈ నిర్ణయం కోలుకోలేని దెబ్బ కొట్టనుంది. ఇప్పటికే భారతీయులు గ్రీన్ కార్డ్ పొందడానికి దశాబ్దాల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇటీవల వెలువడిన వీసా బులిటెన్ ప్రకారం ఈబీ-2, ఈబీ-3 కేటగిరీలలో భారతీయులకు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ చాలా నెమ్మదిగా సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోవడం వల్ల క్యూలో ఉన్న వేలాది మంది భవిష్యత్తు అంధకారంలో పడింది.

హెచ్-1బీ వీసాదారుల నిష్క్రమణ ముప్పు

సాధారణంగా హెచ్-1బీ వీసాపై అమెరికాలో గరిష్టంగా ఆరేళ్ల పాటు మాత్రమే పనిచేసే వెసులుబాటు ఉంటుంది. ఆరేళ్ల కాల పరిమితి దాటిన తర్వాత కూడా అక్కడే ఉండాలంటే పర్మ్ ప్రాసెసింగ్ పూర్తయి ఉండటం అత్యవసరం. ఇప్పుడు ఆరేళ్ల వీసా ముగింపునకు దగ్గరగా ఉన్న ఉద్యోగులకు పర్మ్ ఫైలింగ్ నిలిచిపోవడంతో వీసా పొడిగింపు దక్కదు. దాంతో వారంతా నిబంధనల ప్రకారం అమెరికాను వదిలి సొంత దేశానికి తిరిగి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.

Tags: