Tech Lays Off : భారత ఐటీ ఉద్యోగులకు మరో బిగ్ షాక్.. దేశం విడిచి వెళ్తున్న అమెరికన్ కంపెనీ

దేశం విడిచి వెళ్తున్న అమెరికన్ కంపెనీ

Update: 2026-06-12 05:17 GMT

Tech Lays Off : గ్లోబల్ ఐటీ, టెక్నాలజీ రంగంలో లేఆఫ్స్ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ దిగ్గజం ఓపెన్‌డోర్ భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. కంపెనీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం కారణంగా ఇండియా ఆఫీసుల్లో పనిచేస్తున్న దాదాపు 250 మంది టెక్ ఉద్యోగులు ఒకేసారి తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. తమ అంతర్గత వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించే భాగంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది.

పనులన్నీ అమెరికాకే షిఫ్ట్ చేస్తున్న సంస్థ

భారతదేశంలో ఉన్న తమ ఆపరేషన్స్, టెక్నికల్ విభాగాన్ని పూర్తిగా మూసివేసి, ఆ పనులన్నింటినీ తిరిగి అమెరికాకు తరలిస్తున్నట్లు ఓపెన్‌డోర్ సీఈఓ కాజ్ నెజాటియన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత నోట్‌లో అధికారికంగా వెల్లడించారు. కొన్ని నెలల క్రితం కంపెనీ ఓపెన్‌డోర్ 2.0 అనే సరికొత్త వ్యూహాత్మక బిజినెస్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. అప్పటి నుంచే భారత దేశంలోని కొన్ని కీలక విభాగాల బాధ్యతలను నెమ్మదిగా అమెరికా ఆఫీసులకు బదిలీ చేయడం ప్రారంభించారు. తాజాగా మిగిలిన విభాగాలను కూడా పూర్తిగా తరలిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ట్రాన్సిషన్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు కొంతమంది ఉద్యోగులు కంపెనీలో కొనసాగుతారని ఆయన తెలిపారు.

ఉద్యోగాల ఊస్టింగ్.. ఏఐ, ఆటోమేషన్ దెబ్బ

అయితే, ఈ ఉద్యోగాల తొలగింపునకు భారతీయ సిబ్బంది పనితీరు కారణం కాదని కంపెనీ స్పష్టంగా చెప్పింది. మన దేశ ఉద్యోగుల ప్రతిభను, కంపెనీ ఎదుగుదలకు వారు చేసిన కృషిని సీఈఓ ప్రత్యేకంగా అభినందించారు. అసలు కారణం ఏంటంటే.. గతంలో కంపెనీకి ఉన్న అనేక రకాల విభిన్న సిస్టమ్స్, మాన్యువల్ వర్క్‌ఫ్లోలను నిర్వహించడానికి పెద్ద ఎత్తున టీమ్స్ అవసరమయ్యేవి. కానీ ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్ల వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో.. చాలా వరకు పనులు మానవ శ్రమ లేకుండానే సులభంగా ముగిసిపోతున్నాయి. ఈ సాంకేతిక విప్లవమే ఉద్యోగాల కోతకు ప్రధాన కారణమైంది.

కస్టమర్లకు దగ్గరగా ఉండాలనే ఈ సరికొత్త ప్లాన్

సీఈఓ కాజ్ నెజాటియన్ వివరణ ప్రకారం.. ఓపెన్‌డోర్ కంపెనీకి ఉన్న క్లయింట్లు, కస్టమర్లు అంతా అమెరికాలోనే నివసిస్తున్నారు. వ్యాపార సూత్రాల ప్రకారం ఆపరేషనల్ టీమ్ కూడా కస్టమర్లకు వీలైనంత దగ్గరగా ఉంటే సర్వీస్ మెరుగ్గా ఉంటుందని కంపెనీ భావించింది. ఏఐ సాయంతో నడిచే చిన్న చిన్న కస్టమర్-ఫేసింగ్ టీమ్‌లను అమెరికాలోనే ఏర్పాటు చేయడం ద్వారా.. విదేశాల్లో భారీ ఎత్తున ఆపరేషనల్ స్టాఫ్‌ను నిర్వహించాల్సిన అవసరం కంపెనీకి లేకుండా పోయింది. అందుకే ఇండియాలో క్లోజర్ బోర్డు పెట్టేసి, ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది.

ఉద్యోగులకు సెవెరెన్స్ ప్యాకేజీలు గ్యారెంటీ

ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్న భారతీయ ఉద్యోగులను ఆదుకోవడానికి కంపెనీ కొన్ని మానవీయ చర్యలను ప్రకటించింది. బాధితులందరికీ చట్టప్రకారం అందాల్సిన పూర్తి ఆర్థిక సహాయంతో కూడిన సెవెరెన్స్ ప్యాకేజీ అందిస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు వేరే కంపెనీల్లో ఉద్యోగాలు వెతుక్కోవడానికి వీలుగా ఔట్‌ప్లేస్‌మెంట్ సర్వీసెస్, అవసరమైన ట్రాన్సిషన్ సపోర్ట్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఇతర కంపెనీలు ఎవరైనా రిక్రూట్‌మెంట్ కోసం వస్తే.. మా భారతీయ ఉద్యోగుల ప్రతిభను తామే స్వయంగా సిఫార్సు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఈఓ తన నోట్‌లో పేర్కొనడం విశేషం.

Tags:    

Similar News