UPI : ఆగస్టు 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్

యూపీఐ కొత్త రూల్స్;

Update: 2025-07-29 05:14 GMT

UPI : యూపీఐ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారా? అయితే, ఆగస్టు 1 నుండి కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్, ఆటో-పే వంటి ఫీచర్‌లు, ఇంకా ఏపీఐ వినియోగానికి సంబంధించిన నిబంధనల్లో సవరణలు జరుగుతున్నాయి. యూపీఐ సేవలను మరింత సమర్థవంతంగా, స్థిరంగా మార్చడానికి ఈ మార్పులు చేస్తున్నారు. గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి యూపీఐ వినియోగదారులు ముఖ్యంగా వీటిని గమనించుకోవాలి. మీరు ఒక యూపీఐ యాప్‌లో ఒక రోజులో కేవలం 50 సార్లు మాత్రమే ఏదైనా బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ తనిఖీ చేయగలరు. అంతకంటే ఎక్కువ సార్లు బ్యాలెన్స్ చెక్ చేయడానికి కుదరదు.

మీ మొబైల్ నంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల సమాచారాన్ని ఒక రోజులో 25 సార్లు మాత్రమే పొందడానికి అనుమతి ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలు వంటి వాటికి మనం క్రమం తప్పకుండా డబ్బులు చెల్లిస్తుంటాం. ఇవి ఆటోమెటిక్‌గా కట్ అవ్వడానికి ఆటో-డెబిట్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు, ఈ ఆటో-డెబిట్‌లు కొన్ని నిర్దిష్ట సమయాల్లో మాత్రమే జరిగేలా పరిమితులు విధించారు. అంటే ఉదయం 10 గంటలలోపు, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు, రాత్రి 9:30 తర్వాత ఈ సమయాల్లో మాత్రమే ఆటో-డెబిట్‌లు జరిగేలా నిబంధనలు తెచ్చారు.

మీరు చేసిన ట్రాన్సాక్షన్ ఇంకా పెండింగ్‌లో ఉండి, దాని స్టేటస్ తనిఖీ చేయాలనుకుంటే, దానికి కూడా పరిమితి పెట్టారు. మీరు మూడు సార్లు మాత్రమే స్టేటస్ తనిఖీ చేయగలరు. ప్రతి తనిఖీ మధ్య కనీసం 90 సెకన్ల గ్యాప్ ఉండాలి. ప్రస్తుతం యూపీఐ వినియోగం విపరీతంగా పెరిగింది. ఒక నెలలో దాదాపు 1,600 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. దీనివల్ల యూపీఐ నెట్‌వర్క్‌పై భారీ ఒత్తిడి పడుతోంది. ఈ ఒత్తిడిని తగ్గించి, సేవలను మరింత మెరుగుపరచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ చర్యలు తీసుకుంది.

Tags:    

Similar News