SIP : ఐదేళ్ల ఆలస్యం.. 3 కోట్ల నష్టం.. ఇన్వెస్ట్‌మెంట్‌లో టైమింగ్ మిస్ అయితే రిటైర్మెంట్ ప్లాన్ రివర్స్ అవ్వాల్సిందే

ఇన్వెస్ట్‌మెంట్‌లో టైమింగ్ మిస్ అయితే రిటైర్మెంట్ ప్లాన్ రివర్స్ అవ్వాల్సిందే

Update: 2026-04-11 10:43 GMT

SIP : డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే, ఆ సంపాదించిన సొమ్మును సరైన సమయంలో, సరైన చోట పెట్టుబడి పెట్టడం మరొక ఎత్తు. చాలామంది ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనే విషయంలో తలలు పట్టుకుంటారు కానీ, అసలైన రహస్యం మాత్రం ఏ వయసులో పెట్టుబడి మొదలుపెట్టామన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. కేవలం ఐదేళ్లు ఆలస్యం చేస్తే మీ రిటైర్మెంట్ ఫండ్‌లో ఏకంగా రూ.3 కోట్లు మేర గండి పడే ప్రమాదం ఉంది.

పెట్టుబడి విషయంలో కాలమే అతిపెద్ద పెట్టుబడి. దీనిని ఒక ఉదాహరణతో చూద్దాం. ఆయుషి, ఆయుష్ అనే ఇద్దరు మిత్రులు నెలకు రూ.10,000 చొప్పున ఎస్‌ఐపీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయుషి తన 25వ ఏటనే ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెట్టగా, ఆయుష్ మాత్రం 30 ఏళ్లు వచ్చాక ప్రారంభించాడు. అంటే కేవలం ఐదేళ్ల తేడా. ఇద్దరికీ ఏడాదికి 12 శాతం రిటర్న్స్ వస్తాయని అనుకుందాం. 60 ఏళ్ల వయసులో వీరు రిటైర్ అయ్యే సమయానికి ఆ ఐదేళ్ల గ్యాప్ ఒక పెద్ద అగాధంగా మారుతుంది.

36 లక్షల పెట్టుబడి.. 3.5 కోట్లు ఎలా అయింది?

ముప్పై ఏళ్ల వయసులో మొదలుపెట్టిన ఆయుష్, 30 ఏళ్లలో మొత్తం రూ.36 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు. అతనికి వచ్చే రిటైర్మెంట్ ఫండ్ సుమారు రూ.3.52 కోట్లు. అదే 25 ఏళ్లకే మొదలుపెట్టిన ఆయుషి, 35 ఏళ్లలో మొత్తం రూ.42 లక్షలు ఇన్వెస్ట్ చేస్తుంది. కానీ ఆమెకు వచ్చే రిటైర్మెంట్ ఫండ్ ఏకంగా రూ.6.49 కోట్లు. ఆయుషి కేవలం రూ.6 లక్షలు మాత్రమే అదనంగా ఇన్వెస్ట్ చేసింది, కానీ ఆమెకు దక్కిన లాభం మాత్రం ఆయుష్ కంటే సుమారు రూ.3 కోట్లు ఎక్కువ. ఇదంతా కంపౌండింగ్ మహిమే. పెట్టుబడి కాలం పెరిగే కొద్దీ లాభం ఊహించని రీతిలో పెరుగుతుంది.

ఈ రోజు వినడానికి 3 కోట్లు లేదా 6 కోట్లు భారీ మొత్తంగా అనిపించవచ్చు. కానీ, భవిష్యత్తులో పెరిగే ధరలను కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. ఏడాదికి సగటున 6 శాతం ద్రవ్యోల్బణం అనుకుంటే.. 35 ఏళ్ల తర్వాత ఆయుషికి వచ్చే రూ.6.4 కోట్ల విలువ ఇప్పటి లెక్కలో కేవలం రూ.1.07 కోట్లతో సమానం. అలాగే ఆయుష్‌కు వచ్చే రూ.3.5 కోట్ల విలువ ఇప్పటి రూ.61 లక్షలతో సమానం. అంటే రూపాయి విలువ కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది కాబట్టి, మనం పక్కా ప్లాన్ తో వెళ్లాలి.

కేవలం ఒక ఫిక్స్‌డ్ అమౌంట్‌తో ఎస్‌ఐపీ చేస్తే సరిపోదు. ధరల పెరుగుదలను తట్టుకోవాలంటే స్టెప్-అప్ ఎస్‌ఐపీ విధానాన్ని పాటించాలి. అంటే ప్రతి ఏటా మీ పెట్టుబడి మొత్తాన్ని కనీసం 10 శాతం పెంచుకుంటూ పోవాలి. మీ ఆదాయం పెరిగినప్పుడల్లా పెట్టుబడిని కూడా పెంచడం వల్ల, రిటైర్మెంట్ నాటికి ద్రవ్యోల్బణాన్ని తట్టుకోగలిగే పటిష్టమైన నిధిని సమకూర్చుకోవచ్చు. అందుకే రేపు చేద్దాంలే అని వాయిదా వేయకుండా, నేడే మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించండి.

Tags:    

Similar News