War Crisis : సామాన్యుడిపై యుద్ధం దెబ్బ.. ఏప్రిల్ నుంచి పెయింట్లు, బట్టలు, విమాన టికెట్లు ప్రియం
ఏప్రిల్ నుంచి పెయింట్లు, బట్టలు, విమాన టికెట్లు ప్రియం
War Crisis : మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య చెలరేగిన యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారతీయ సామాన్యుడి వంటింటి వరకు వచ్చేస్తున్నాయి. ఇంధన ధరలు పెరగడం అంటే కేవలం పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడమే కాదు.. మన నిత్యజీవితంలో వాడే ప్రతీ వస్తువు ధర ఆకాశాన్ని తాకబోతోంది. ముడి చమురు ధరలు బ్యారెల్ 100 డాలర్ల పైన ఇలాగే కొనసాగితే, రాబోయే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం చుక్కలు చూపించడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు తమ తయారీ ఖర్చులు పెరిగిపోవడంతో, ఆ భారాన్ని కస్టమర్లపై ఎప్పుడు వేయాలా అని ఆలోచిస్తున్నాయి.
ముఖ్యంగా పెయింట్స్ రంగంపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. మనం ఇళ్లకు వేసుకునే రంగుల తయారీలో వాడే ముడి సరుకుల్లో 60 శాతం ముడి చమురు నుంచే వస్తుంది. చమురు ధరలు పెరగడంతో ఏప్రిల్ నుంచి పెయింట్ల ధరలు 2 శాతం నుంచి 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే, మనం తినే వంట నూనెల ధరలు కూడా పెరగనున్నాయి. భారత్ తన అవసరాలకు సరిపడా వంట నూనెలో మూడింట రెండు వంతులు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా కష్టతరం కావడంతో రవాణా ఖర్చులు పెరిగి, నూనె ధరలు భగ్గుమనేలా ఉన్నాయి.
దుస్తులు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సింథటిక్ దుస్తులు, యోగా ప్యాంట్లు, కార్పెట్ల తయారీలో వాడే పెట్రోకెమికల్స్ ధరలు పెట్రోల్ ధరలపై ఆధారపడి ఉంటాయి. దీంతో ఈ వస్తువుల ధరలు 70-80 శాతం వరకు పెరిగే ప్రమాదం ఉంది. ఇక బిస్కెట్లు, నమకీన్ వంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో వాడే పామాయిల్ ధరలు ఇప్పటికే మార్చిలో 4 శాతం పెరిగాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజల స్నాక్స్ ఖర్చులు కూడా పెరగబోతున్నాయి.
ప్రయాణాల విషయానికి వస్తే, విమాన ప్రయాణం మరింత భారంగా మారనుంది. విమాన ఇంధనం ధరలు పెరగడంతో ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి కంపెనీలు ఇప్పటికే ఫ్యూయల్ సర్ఛార్జ్ పేరుతో టికెట్ ధరలను పెంచేశాయి. మరోవైపు ఆటోమొబైల్ రంగంలోనూ టైర్లు ప్రియం కానున్నాయి. టైర్ల తయారీలో వాడే సింథటిక్ రబ్బర్, కార్బన్ బ్లాక్ వంటివి ముడి చమురు నుంచే తయారవుతాయి. దీంతో టైర్ల ధరలు కూడా 3 శాతం నుంచి 8 శాతం వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్ల వంటి వ్యక్తిగత సంరక్షణ వస్తువుల ప్యాకేజింగ్ ఖర్చు కూడా పెరగడంతో, సామాన్యుడి నెలవారీ బడ్జెట్ తలకిందులు కావడం ఖాయంగా కనిపిస్తోంది.