Budget 2026 : బడ్జెట్ 2026 వెల్నెస్ ధమాకా..ఆయుర్వేదం, యోగాకు మహర్దశ..లక్షలాది మందికి ఉపాధి

ఆయుర్వేదం, యోగాకు మహర్దశ..లక్షలాది మందికి ఉపాధి

Update: 2026-02-01 09:56 GMT

Budget 2026 : ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంప్రదాయ వైద్యానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర బడ్జెట్ 2026లో ఆయుర్వేదం, యోగా రంగాలకు పెద్దపీట వేశారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్నెస్ రంగాన్ని కేవలం ఆరోగ్యంతోనే కాకుండా, ఉపాధి, పరిశోధనలతో అనుసంధానించే అద్భుతమైన ప్రణాళికను ప్రకటించారు. భారతదేశాన్ని గ్లోబల్ వెల్నెస్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఈసారి కేటాయింపులు జరిగాయి.

కేంద్ర బడ్జెట్ 2026లో వెల్నెస్ రంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఒక భారీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. యోగా, వెల్నెస్ సేవల కోసం ఏకంగా 1.5 లక్షల మంది కేర్‌గివర్లకు అత్యాధునిక శిక్షణ ఇవ్వనున్నారు. దీనివల్ల దేశీయంగా నాణ్యమైన ఆరోగ్య సేవలు అందడమే కాకుండా, విదేశాల్లో పెరుగుతున్న భారతీయ యోగా నిపుణుల డిమాండ్‌ను కూడా మన యువత అందిపుచ్చుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మందికి కొత్త ఉపాధి మార్గాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆయుర్వేద విద్య, పరిశోధనలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం మూడు కొత్త ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థలను ఏర్పాటు చేయబోతోంది. వీటితో పాటు మరో ఏడు కొత్త ఆయుర్వేద విద్యా సంస్థలను కూడా ప్రారంభించనున్నారు. కేవలం చికిత్సకే పరిమితం కాకుండా, శాస్త్రీయ కోణంలో ఆయుర్వేద గొప్పతనాన్ని నిరూపించేలా ఈ సంస్థల్లో భారీ స్థాయిలో రీసెర్చ్ నెట్‌వర్క్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దీని ద్వారా భారత్ ఆయుర్వేద జ్ఞానానికి గ్లోబల్ సెంటర్‌గా అవతరించనుంది.

ఆరోగ్య రంగంలో అనుబంధ సేవలైన ఆప్టోమెట్రీ, అనస్థీషియా, అప్లైడ్ సైకాలజీ వంటి 10 కొత్త సబ్జెక్టులను విద్యా కోర్సుల్లో చేర్చనున్నారు. వచ్చే ఐదేళ్లలో ఒక లక్ష మంది అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్‌ను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇది కాకుండా, ఫార్మా రంగంలో పరిశోధనల కోసం 3 కొత్త నైపర్ (NIPER) సంస్థలు, ఏడు పాత సంస్థల అప్‌గ్రేడ్, దేశవ్యాప్తంగా 1,000 గుర్తింపు పొందిన క్లినికల్ ట్రయల్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్యలన్నీ భారత్ సంప్రదాయ వైద్యం, ఆధునిక పరిశోధనల కలయికతో ఆరోగ్య రంగంలో సరికొత్త శక్తిగా ఎదిగేలా చేస్తాయి.

Tags:    

Similar News