DBT System : సర్కార్ డబ్బు నేరుగా మీ జేబులోకి.. అసలేంటి ఈ DBT సిస్టమ్? ఎలా పనిచేస్తుంది?
అసలేంటి ఈ DBT సిస్టమ్? ఎలా పనిచేస్తుంది?
DBT System : ప్రభుత్వ పథకాల గురించి సామాన్యుడి మనసులో తరచుగా మెదిలే ప్రశ్న ఒక్కటే..ప్రభుత్వం పంపిన డబ్బు నిజంగా అవసరమైన వారికి పూర్తిగా చేరుతోందా? పాత రోజుల్లో ఇది పెద్ద సవాలుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. దీనికి కారణం DBT, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అనే టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారానే ఇటీవల పీఎం కిసాన్ పథకంలో 21వ విడత కింద రూ.18 వేల కోట్లకు పైగా డబ్బు, కళ్లు మూసి తెరిచేలోగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ అయింది. ఇంతకీ ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? మధ్యవర్తుల ఆధిపత్యాన్ని ఎలా అంతం చేసింది? వివరంగా తెలుసుకుందాం.
DBT సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అనేది ప్రభుత్వం, సాధారణ పౌరుల మధ్య ఉన్న ఒక నేరుగా డిజిటల్ వారధి. ఈ విధానంలో ప్రభుత్వం సబ్సిడీ లేదా పథకం డబ్బును ఏ విభాగం, అధికారి లేదా నాయకుడి చేతికి ఇవ్వకుండా నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలోకి పంపుతుంది. ప్రభుత్వ సహాయంలో జరిగే లీకేజీని అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో ఈ సిస్టమ్ కు 2013, జనవరి 1న పునాది వేశారు. మొదట్లో, ప్రభుత్వ నిధుల పంపిణీని పర్యవేక్షించడానికి ప్రణాళికా సంఘం దీనిని రూపొందించింది. 2015లో దీని ప్రాముఖ్యత పెరగడంతో మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ బాధ్యతను క్యాబినెట్ సెక్రటేరియట్‌కు అప్పగించారు.
ప్రభుత్వ ఖజానా నుంచి మీ జేబులోకి డబ్బు ప్రయాణం
డీబీటీ అనేది కేవలం ఒక సాఫ్ట్‌వేర్ కాదు, ఇది పారదర్శకంగా పనిచేసే ఒక సమన్వయపూర్వక విధానం. ఈ వ్యవస్థ కేంద్ర ప్రణాళికా పర్యవేక్షణ వ్యవస్థ (CPSMS) పై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం మొదట అర్హులైన వ్యక్తుల జాబితాను తయారు చేస్తుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆధార్ వివరాలను ఉపయోగించి, లబ్ధిదారుడి గుర్తింపు సరైనదా కాదా అని నిర్ధారిస్తారు. డబ్బు నేరుగా ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి, వేరే వ్యక్తి డబ్బును స్వాహా చేసే అవకాశం ఉండదు. ప్రభుత్వం చెల్లింపును విడుదల చేయగానే, ఎటువంటి మానవ జోక్యం లేకుండా, అది నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ అవుతుంది.
కోట్ల రూపాయలు సెకన్లలో బదిలీ
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం డీబీటీ విజయాన్ని తెలియజేసే ఒక గొప్ప ఉదాహరణ. ఈ పథకం కింద భూమి ఉన్న రైతు కుటుంబాలకు వ్యవసాయ అవసరాల కోసం సంవత్సరానికి రూ.6,000 సహాయం అందుతుంది. ఈ సిస్టమ్ లేకపోతే, రూ.18వేల కోట్లను 9 కోట్ల మందికి నగదు లేదా చెక్కుల ద్వారా పంపిణీ చేయడానికి నెలలు పట్టేది పైగా అవినీతి ప్రమాదం ఉండేది. డీబీటీ ద్వారా, ఆర్థికంగా స్థితిమంతులైన వారు ఈ పథకం నుంచి ఆటోమేటిక్ గా తొలగించేలా, నిజంగా కష్టపడుతున్న రైతులకు మాత్రమే సహాయం అందేలా తయారు చేశారు. నేడు ఢిల్లీ నుంచి పంపిన మొత్తం డబ్బు, ఒక్క రూపాయి కూడా తగ్గకుండా గ్రామంలోని రైతు ఖాతాకు సురక్షితంగా చేరుతోంది. ఈ టెక్నాలజీ సమయాన్ని ఆదా చేయడమే కాక ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని కూడా పెంచుతోంది.