Cyber Security Tips: బ్యాంకు లోన్లు, ఇతర సేవల కోసం వాట్సాప్‌లో ఆధార్, పాన్ కార్డులు పంపడం మనందరికీ అలవాటుగా మారింది. అయితే ఎంత సులభంగా అనిపించినా, ఈ చిన్న పొరపాటు వల్ల మీ వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ సున్నితమైన సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవడానికి ఏ ప్రమాదాలు ముంచుకొస్తాయో వెంటనే తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఎలాంటి సర్వీసు కావాలన్నా డిజిటల్ డాక్యుమెంట్స్ చూపించడం తప్పనిసరి అయిపోయింది. బ్యాంకు ప్రతినిధులు, ఏజెంట్లు లోన్లు ఇప్పిస్తామని చెప్పగానే మనం వెంటనే మన ఆధార్, పాన్ కార్డుల ఫోటోలను వాట్సాప్‌లో షేర్ చేసేస్తున్నాం. పంపిన వ్యక్తి చాలా మంచివాడు, నమ్మకస్తుడే కావచ్చు, కానీ సమస్య అంతా ఆ తర్వాతే మొదలవుతుంది. మీరు పంపిన పత్రాలు ఆ వ్యక్తి ఫోన్ క్లౌడ్ స్టోరేజ్ లేదా గ్యాలరీలో భద్రంగా ఉండిపోతాయి. ఆ ఫోన్ హ్యాకింగ్‌కు గురైనా, ఆ వ్యక్తి డివైజ్ పొరపాటున ఇతరుల చేతుల్లోకి వెళ్లే క్రమంలో మీ సున్నితమైన వివరాలు చోరీకి గురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

వ్యక్తిగత వివరాల చోరీ

ఏదైనా గుర్తింపు పొందిన సంస్థల అధికారిక పోర్టల్స్ ద్వారా పత్రాలు పంపితే పెద్దగా భయం ఉండదు. కానీ వ్యక్తుల ఫోన్ నంబర్లకు నేరుగా గుర్తింపు కార్డులు పంపినప్పుడు తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఆధారంగా ఫోన్ నంబర్లు, చిరునామా వంటి వివరాలు అక్రమార్కుల చేతికి చిక్కుతాయి. వీటి ఆధారంగా నకిలీ సిమ్ కార్డులు తీసుకోవడం, మీ పేరిట ఫేక్ బ్యాంక్ ఖాతాలు తెరవడం లేదా మీకు ఫోన్లు చేసి బ్యాంక్ వివరాలు గుంజే ఫ్రాడ్ కాల్స్ చేయడం వంటి మోసాలకు పాల్పడే ముప్పు ఉంటుంది.

డిజిలాకర్ వాడకమే సురక్షితమైన ప్రత్యామ్నాయం

ఈ తరహా డిజిటల్ మోసాల నుంచి తప్పుకోవడానికి ప్రభుత్వం అందిస్తున్న డిజిలాకర్ అద్భుతమైన వేదికగా పనిచేస్తుంది. మీ అధికారిక గుర్తింపు పత్రాలను వాట్సాప్ ద్వారా నేరుగా పంపే బదులు డిజిలాకర్ నుంచి వెరిఫై చేసిన డాక్యుమెంట్ లింక్‌లు లేదా క్యూఆర్ కోడ్‌లను షేర్ చేయడం సురక్షితం. దీనివల్ల మీ పత్రాలు ఇతరుల ఫోన్లలో స్టోర్ కావు. కేవలం ధృవీకరణ మాత్రమే పూర్తవుతుంది.

మీ సమాచార రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీరు తప్పనిసరి పరిస్థితుల్లో వాట్సాప్‌లో పత్రాలు పంపాల్సి వస్తే, ఆ పని పూర్తయిన వెంటనే ఎదుటి వ్యక్తిని ఆ డాక్యుమెంట్లను డిలీట్ చేయమని కోరడం మంచిది. మీరు పంపిన చాట్‌లోని పత్రాలను కూడా డిలీట్ ఫర్ ఎవ్రీవన్ చేయడం అలవాటు చేసుకోవాలి. మన వ్యక్తిగత వివరాల భద్రత మన చేతుల్లోనే ఉంది. చిన్నపాటి అలసత్వం పెద్ద ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని గ్రహించి అడుగులు వేయడం శ్రేయస్కరం.

Tags: