EV Insurance : ఈవీ వాహనదారుల్లో టెన్షన్.. ఎలక్ట్రిక్ బైక్ లేదా కార్లలో అగ్ని ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వస్తుందా?

అగ్ని ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వస్తుందా?

Update: 2026-07-16 11:24 GMT

EV Insurance : ఇటీవల నోయిడాలోని సెక్టార్ 66లో ఒక బిల్డింగ్ పార్కింగ్‌లో నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ బైక్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ ప్రమాదం సంభవించింది. ఈ దురదృష్టకర సంఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఫైర్ సిబ్బంది వంద మందికి పైగా సురక్షితంగా బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఈ భయానక ప్రమాదం దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహన యజమానులలో ముఖ్యంగా మధ్యతరగతి వాహనదారులలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఒకవేళ మన ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగితే ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహారం చెల్లిస్తుందా? అనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. దీనికి సమాధానం అవును వస్తుంది.. కానీ దానికి మీ ఇన్సూరెన్స్ పాలసీ సరైనదై ఉండాలి.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే లాభం లేదు

బీమా రంగ నిపుణుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రభుత్వంగానీ, బీమా కంపెనీలుగానీ ఎలాంటి ప్రత్యేకమైన ప్రత్యేక పాలసీలను లేదా విడిగా గైడ్‌లైన్స్‌ను తీసుకురాలేదు. ప్రస్తుతం ఉన్న సాధారణ కాంప్రహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కిందనే ఈవీ వాహనాలకు కూడా రక్షణ కల్పిస్తున్నారు. చార్జింగ్ పెట్టే సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పు అంటుకున్నా, లేదా రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు బ్యాటరీ వేడెక్కి వాహనం తగలబడినా ఈ కాంప్రహెన్సివ్ పాలసీ పరిధిలోకి వస్తుంది. అయితే కేవలం బేసిక్ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటే మాత్రం మీ సొంత వాహనం కాలిపోతే ఒక్క రూపాయి కూడా రాదు, ఎందుకంటే అది కేవలం అవతలి వారికి జరిగే నష్టాన్ని మాత్రమే భరిస్తుంది.

ఐడీవీ అంటే ఏమిటి?

వాహనానికి ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే పరిహారం మొత్తం మీ పాలసీ ఐడీవీ పై ఆధారపడి ఉంటుంది. అంటే బీమా చేసే సమయంలో మీ వాహనం మార్కెట్ విలువను బట్టి ఈ ధరను లెక్కిస్తారు. సాధారణ పాలసీలలో వాహనం కొన్న కాల పరిమితిని బట్టి తరుగుదల మొత్తాన్ని మినహాయించి మిగిలిన డబ్బులను చెల్లిస్తారు. అయితే మధ్యతరగతి వారు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కాస్త అదనంగా ఖర్చు చేసి జీరో డెప్రిసియేషన్ లేదా రిటర్న్ టు ఇన్వాయిస్ వంటి యాడ్-ఆన్ కవర్లను ఎంచుకుంటే, ప్రమాదం జరిగినప్పుడు వాహనం కొన్న బిల్లు విలువ ప్రకారం దాదాపు పూర్తి డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ చిన్న తప్పులు చేస్తే మీ ఈవీ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడం ఖాయం

చాలా సార్లు క్లెయిమ్ అప్లై చేసినా ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తాయి. దానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.

* అక్రమ మోడిఫికేషన్లు: ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పకుండా వాహనంలో బయటి మార్కెట్ నుంచి ఫ్యాన్సీ లైట్లు లేదా ఇతర ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ అమర్చడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగితే క్లెయిమ్ వెంటనే రిజెక్ట్ అవుతుంది.

* నిర్లక్ష్యం: ఇగ్నిషన్ లేదా ఇంజన్ ఆన్ చేసి అలాగే వదిలేయడం, తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదం జరిగితే బీమా వర్తించదు.

* పాలసీ గడువు ముగియడం: కరెక్ట్ టైమ్‌కి ప్రీమియం కట్టకుండా పాలసీ లాప్స్ అయిపోతే కంపెనీ నుంచి ఎలాంటి సహాయం అందదు.

క్లెయిమ్ డబ్బులు వేగంగా అందుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే

మీ ఎలక్ట్రిక్ వాహనానికి ప్రమాదం జరిగితే కంగారు పడకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:

* సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి: మొదట మీ ప్రాణాలను కాపాడుకోండి. వాహనానికి సురక్షితమైన దూరంలో నిలబడి ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలను మొబైల్‌లో రికార్డ్ చేయండి. ఇదే మీ పెద్ద ఆధారం.

* పోలీసులకు సమాచారం: వెంటనే ఫైర్ బ్రిగేడ్, పోలీసులకు కాల్ చేయండి. అగ్ని ప్రమాదాల కేసులలో పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌కు అత్యంత కీలకమైన పత్రం.

* కంపెనీకి సమాచారం: ఆలస్యం చేయకుండా మీ ఇన్సూరెన్స్ కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్ లేదా యాప్ ద్వారా క్లెయిమ్ రిజిస్టర్ చేయండి.

* సర్వేయర్ తనిఖీ: ఇన్సూరెన్స్ కంపెనీ తరపున ఒక ఎక్స్‌పర్ట్ వచ్చి వాహనాన్ని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తారు.

* డాక్యుమెంట్లు సమర్పించండి: పాలసీ కాపీ, ఎఫ్ఐఆర్ రిపోర్ట్, ప్రమాద విజువల్స్ సబ్మిట్ చేస్తే వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ పరిహారం అందుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో వాహనాలను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకుంటూ వైరింగ్ చెక్ చేసుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News