PF Money : పీఎఫ్ ఖాతాదారులకు పండగే.. ఇకపై ఏటీఎం నుంచే నేరుగా పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు

ఇకపై ఏటీఎం నుంచే నేరుగా పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు

Update: 2026-04-30 10:36 GMT

PF Money : ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించనుంది. ఇకపై మీ పీఎఫ్ డబ్బుల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు, నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ దగ్గర్లోని ఏటీఎం సెంటర్‌కు వెళ్లి చిటికెలో డబ్బులు డ్రా చేసుకునే సరికొత్త వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఇది ఒక చారిత్రాత్మక ఊరటని చెప్పవచ్చు.

ఏటీఎం నుంచే పీఎఫ్.. ఎలా సాధ్యం?

ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు తీసుకోవడం అంటే ఒకప్పుడు పెద్ద ప్రహసనం. కాగితాల మీద సంతకాలు, ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు తప్పనిసరి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ 3.0 కింద ఈ ప్రక్రియను అత్యంత సరళతరం చేస్తోంది. మీ పీఎఫ్ ఖాతాను నేరుగా బ్యాంకింగ్ గేట్‌వేతో అనుసంధానిస్తారు. దీనివల్ల మీ పీఎఫ్ డబ్బులు మీ సేవింగ్స్ అకౌంట్ లాగే పనిచేస్తాయి. ఏటీఎం సెంటర్‌కు వెళ్లి కార్డు ద్వారా లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా యూపీఐ ఉపయోగించి నేరుగా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.

టెక్నికల్ ట్రయల్స్ సక్సెస్

ఈ కొత్త వ్యవస్థకు సంబంధించి అన్ని టెక్నికల్ ప్రక్రియలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఏటీఎం మిషన్లలో డ్రై రన్, ఫైనల్ రన్ ట్రయల్స్ కూడా విజయవంతంగా ముగిశాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవస్థను పూర్తి సురక్షితంగా రూపొందించారు. ప్రధాని నరేంద్ర మోదీ మే నెలలో ఏదైనా శుభ ముహూర్తాన ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. దీనికోసం ప్రత్యేకమైన పీఎఫ్ కార్డులు కూడా జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.

స్పెషల్ కార్డులు

పీఎఫ్ ఖాతాదారులకు ప్రత్యేకమైన కార్డులు అందించడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. సాధారణంగా పీఎఫ్ క్లెయిమ్ చేసినప్పుడు డబ్బులు అకౌంట్‌లోకి రావడానికి వారం నుంచి పది రోజులు పడుతుంది. కానీ ఈ ఏటీఎం విధానం అమల్లోకి వస్తే, ఎమర్జెన్సీ సమయంలో ఆసుపత్రి ఖర్చులకైనా, ఇతర అవసరాలకైనా వెంటనే నగదు పొందే వీలుంటుంది. నగదు ఉపసంహరణ ప్రక్రియలో జాప్యానికి ఇక కాలం చెల్లినట్టే.

ప్రస్తుత విధానం ఎలా ఉంది?

ప్రస్తుతానికి పీఎఫ్ డబ్బులు తీయాలంటే ఆన్‌లైన్‌లో Universal Account Number (UAN) ద్వారా ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. అక్కడ ఫారమ్ 19 (పూర్తి విత్ డ్రా), ఫారమ్ 31 (అడ్వాన్స్), లేదా ఫారమ్ 10C (పెన్షన్) వంటి ఆప్షన్లను ఎంచుకుని క్లెయిమ్ చేయాలి. ఇదంతా చేసినా డబ్బులు రావడానికి కొంత సమయం పడుతుంది. కానీ త్వరలో రాబోయే ఏటీఎం విధానం ఈ కష్టాలన్నింటినీ దూరం చేసి, ఉద్యోగికి తన డబ్బుపై పూర్తి అధికారాన్ని కల్పించనుంది.

Tags:    

Similar News