Food Crisis: ప్రపంచ వ్యాప్తంగా సామాన్యుల వంటగది బడ్జెట్‌పై తీవ్రమైన ప్రభావం పడబోతోంది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన కమోడిటీ మార్కెట్స్ అవుట్‌లుక్ తాజా నివేదిక ప్రకారం.. రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా నిత్యవసరాల ధరలు అమాంతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో నిరంతరం సాగుతున్న యుద్ధ వాతావరణం, ఎల్ నినో ప్రభావం, ఇంధనం సరఫరాలో అవాంతరాలు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు తీవ్ర ముప్పు తెచ్చిపెడుతున్నాయని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. చమురు సరఫరా క్రమంగా తగ్గడంతో రాబోయే రోజుల్లో కమోడిటీల ధరలు ఏకంగా 23 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

నాలుగు సంవత్సరాల గరిష్టానికి..

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల చమురు నిల్వలు గణనీయంగా పడిపోయాయి. దీని ప్రభావంతో ఇంధన ధరలు రాబోయే కాలంలో 32 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు ఏకంగా 91 డాలర్ల మార్కును తాకే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. హోర్ముజ్ జలసంధి గుండా సాగే చమురు, గ్యాస్ రవాణాకు ఆటంకాలు ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతింది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ లాంటి దేశాల్లో ఇది తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది.

18 శాతం పెరగనున్న ఆహార ధాన్యాల ధరలు

ఇంధన ధరలు మండటంతో పాటు వ్యవసాయ ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగిపోతోంది. ఎరువులు, ఆయిల్ ధరలు పెరగడంతో పంటల సాగు రైతులకు పెనుభారంగా మారింది. దీనికి తోడు ఎల్ నినో వల్ల సంభవించే వాతావరణ మార్పులు పంట దిగుబడులను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా రాబోయే రోజుల్లో ఆహార పదార్థాల ధరలు మొత్తం మీద 18 శాతం వరకు పెరిగే సూచనలు ఉన్నాయి. ధాన్యాల రవాణా నిలిచిపోవడం వల్ల నిరుపేద దేశాల్లో ఆకలి కేకలు పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఆకాశాన్ని తాకుతున్న లోహాల ధరలు

ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి డిమాండ్ పెరగడంతో అల్యూమినియం, రాగి, టిన్ వంటి పారిశ్రామిక లోహాల ధరలు సరికొత్త రికార్డులను తాకుతున్నాయి. లోహాల ధరలు ఏకంగా 25 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో ప్రపంచంలో నెలకొన్న రాజకీయ అస్థిరతల కారణంగా సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు కూడా 40 శాతం వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది పారిశ్రామిక రంగానికి పెద్ద సవాలుగా మారనుంది.

పేద దేశాలకు అభయమిచ్చిన ప్రపంచ బ్యాంక్

ఆహార, ఇంధన సంక్షోభంలో చిక్కుకున్న బలహీన, పేద దేశాలను ఆదుకోవడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. సుమారు 50 బిలియన్ డాలర్ల నుంచి 60 బిలియన్ డాలర్ల వరకు అత్యవసర నిధులను కేటాయించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. మిడిల్ ఈస్ట్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటికే 8.7 బిలియన్ డాలర్ల అత్యవసర సాయాన్ని అందించినట్లు తెలిపింది. అయితే సంక్షోభం మరింత ముదిరితే పేదరికం ఊహించని రీతిలో పెరిగిపోయే ప్రమాదం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags: