Zepto IPO : జెప్టో కష్టాలు.. స్విగ్గీ, ఇటర్నల్‌లకు లాభాలు! రాకెట్‌లా దూసుకెళ్తున్న ప్రత్యర్థి కంపెనీల షేర్లు!

ప్రత్యర్థి కంపెనీల షేర్లు!

Update: 2026-07-31 10:52 GMT

Zepto IPO : 10 నిమిషాల్లో ఇంటికి సరుకులను చేరవేసే క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో తన పబ్లిక్ ఇష్యూ విషయమై తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. మార్కెట్‌లో ఫండ్స్ సేకరించడానికి జెప్టో చెమటోడుస్తుంటే.. ఇదే అవకాశంగా ప్రత్యర్థి కంపెనీలైన స్విగ్గీ, ఎటర్నల్ స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపుతున్నాయి. జులై నెల ఈ రెండు కంపెనీలకు గత కొన్ని ఏళ్లలో లేనంత ఉత్తమమైన నెలగా నిలిచింది. జెప్టో దగ్గర నగదు కొరత ఏర్పడితే మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టమవుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వాల్యుయేషన్ పడిపోవడమే అసలు సమస్య

జెప్టో ఐపీవో కథలో అసలు ట్విస్ట్ కంపెనీ వాల్యుయేషన్ వద్దే ఎదురైంది. అక్టోబర్ 2025లో అమెరికన్ ఫండ్ కాల్‌పర్స నుంచి నిధులు సేకరించినప్పుడు జెప్టో విలువ సుమారు 7 బిలియన్ డాలర్లుగా ఉండేది. కానీ ఇప్పుడు ఐపీవోకు సిద్ధమవుతున్న తరుణంలో, దేశీయ మ్యూచువల్ ఫండ్స్, పెద్ద ఇన్వెస్టర్లు అంత ఎక్కువ ధరకు షేర్లను కొనడానికి నిరాకరించారు. దీంతో ఒకప్పుడు 3.5 నుండి 4 బిలియన్ డాలర్లుగా అంచనా వేసిన వాల్యుయేషన్ ఇప్పుడు 2.5 నుండి 3 బిలియన్ డాలర్లకు పడిపోయిందని వార్తలు వస్తున్నాయి. కంపెనీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడమే ఇన్వెస్టర్లలో ఈ భయానికి కారణమని తెలుస్తోంది.

లాభాల్లో తేలుతున్న స్విగ్గీ, ఇటర్నల్

స్టాక్ మార్కెట్ సూత్రం ప్రకారం ఒకరి నష్టం మరొకరికి లాభంగా మారుతుంది. జెప్టో బలహీనతను స్విగ్గీ, ఇటర్నల్ చక్కగా వాడుకున్నాయి. జులై నెలలో స్విగ్గీ షేర్లు ఏకంగా 24 శాతం వరకు పెరిగాయి. నవంబర్ 2024లో లిస్ట్ అయిన తర్వాత స్విగ్గీకి ఇదే అత్యుత్తమ నెలగా నమోదు కావడం విశేషం. అదే సమయంలో ఇటర్నల్ షేర్లు కూడా 17 శాతం వరకు పెరిగి గత రెండేళ్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి. జెప్టో సంక్షోభంలో ఉండటంతో స్విగ్గీ, ఇటర్నల్ తమ మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు మంచి అవకాశం లభించింది.

గ్రే మార్కెట్ పతనం.. స్విగ్గీకి దక్కనున్న మైలేజ్

జెప్టో తన ఐపీవో డ్రాఫ్ట్ గడువు ఆగస్టు 21తో ముగుస్తుండటంతో తీవ్ర ఒత్తిడిలో ఉంది. తక్కువ వాల్యుయేషన్‌కు ఒప్పుకోవడం, లేదా ఇష్యూ సైజు తగ్గించడం లేదా లిస్టింగ్‌నే వాయిదా వేయడం వంటి నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఈ అస్పష్టత వల్ల గ్రే మార్కెట్‌లో జెప్టో షేర్లు 20 శాతానికి పైగా పడిపోయాయి. జెప్టో తన ఖర్చులను తగ్గించుకుంటే దాని గ్రోత్ మందగిస్తుందని, దీనివల్ల రెండవ స్థానంలో ఉన్న స్విగ్గీ బాగా లాభపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News