Post Office : పోస్టాఫీసు అదిరిపోయే స్కీమ్..ఒక్కసారి ఇన్వెస్ట్ చేయండి..ప్రతి నెలా రూ.9,250 పొందండి
ఒక్కసారి ఇన్వెస్ట్ చేయండి..ప్రతి నెలా రూ.9,250 పొందండి
Post Office : చాలా మంది తమ దగ్గర ఉన్న డబ్బును ఎక్కడైనా దాచుకుంటే, అసలుకు మోసం రాకుండా ఉండటంతో పాటు నెలకు కొంత ఆదాయం రావాలని కోరుకుంటారు. సాధారణంగా మనవాళ్లు బ్యాంక్ ఎఫ్‌డీలను నమ్ముకుంటారు. కానీ, ఇప్పుడు పోస్టాఫీసులోని మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఎఫ్‌డీల కంటే ఎక్కువ ఆదరణ పొందుతోంది. ఇది ముఖ్యంగా రిటైర్ అయిన వారికి లేదా ఇంటి ఖర్చుల కోసం క్రమం తప్పకుండా ఆదాయం కావాలనుకునే వారికి ఒక వరప్రసాదం లాంటిది.
ఎంత పెట్టుబడి పెట్టవచ్చు? వడ్డీ ఎంత?
ఈ పథకంలో ప్రస్తుతం ప్రభుత్వం 7.4 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. మీరు ఒంటరిగా ఖాతా తెరిస్తే గరిష్టంగా రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అదే మీ భాగస్వామితో కలిసి జాయింట్ ఖాతా తీసుకుంటే ఏకంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి డబ్బు డిపాజిట్ చేస్తే, ఐదేళ్ల పాటు మీకు ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం అందుతూనే ఉంటుంది.
నెలకు రూ. 9,000 పైగా ఎలా వస్తాయి?
మీరు, మీ భార్య కలిసి జాయింట్ అకౌంట్ ద్వారా గరిష్ట పరిమితి అయిన రూ.15 లక్షలను ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేశారనుకుందాం. ప్రస్తుతమున్న 7.4 శాతం వడ్డీ రేటు ప్రకారం, మీకు సంవత్సరానికి రూ.1,11,000 వడ్డీ వస్తుంది. దీనిని 12 నెలలకు విభజిస్తే, నెలకు సరిగ్గా రూ.9,250 మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. అంటే ఎటువంటి రిస్క్ లేకుండా ఇంట్లో కూర్చుని నెలకు తొమ్మిది వేల రూపాయలకు పైగా సంపాదించవచ్చు.
ఐదేళ్ల తర్వాత మీ డబ్బు మీకే
ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్లు. ఈ ఐదేళ్లలో కేవలం వడ్డీ రూపంలోనే మీరు దాదాపు రూ.5.55 లక్షల లాభాన్ని పొందుతారు. గడువు ముగిసిన తర్వాత, మీరు మొదట ఇన్వెస్ట్ చేసిన రూ.15 లక్షల అసలు మొత్తాన్ని పోస్టాఫీసు మీకు తిరిగి ఇచ్చేస్తుంది. ఒకవేళ మీకు అప్పటికే డబ్బు అవసరం లేదనుకుంటే, మళ్ళీ అదే మొత్తాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించవచ్చు. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న పథకం కాబట్టి మీ రూపాయికి కూడా గ్యారెంటీ ఉంటుంది.