Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కస్టమర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పనీర్, చీజ్ పేరిట నకిలీ లేదా కృత్రిమ డెయిరీ ఉత్పత్తులను విక్రయించే రెస్టారెంట్లపై జీరో-టాలరెన్స్ పాలసీని ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లను ప్లాట్‌ఫామ్ నుంచి శాశ్వతంగా తొలగిస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లలో పనీర్, చీజ్ వంటకాలకు ఉండే ఆదరణను ఆసరాగా చేసుకుని కొన్ని రెస్టారెంట్లు కృత్రిమ పదార్థాలతో తయారుచేసిన నకిలీ డెయిరీ ప్రొడక్టులను ఉపయోగిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ రకం సింథటిక్ లేదా ‘ఎనాలాగ్ డెయిరీ’ పదార్థాలు మానవ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. కస్టమర్లకు అందించే ఆహారంలో పారదర్శకత, నాణ్యత పెంచడమే లక్ష్యంగా జొమాటో ఈ సరికొత్త కఠిన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే నకిలీ డెయిరీ వాడకాన్ని అంగీకరించిన పలు రెస్టారెంట్ భాగస్వాములను ప్లాట్‌ఫామ్ నుంచి తక్షణమే తొలగించినట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది.

రెస్టారెంట్లకు స్పష్టమైన ఆదేశాలు

ఈ నూతన పాలసీ ప్రకారం జొమాటోలో లిస్ట్ అయిన ప్రతి రెస్టారెంట్ వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తమ వంటకాల్లో కేవలం స్వచ్ఛమైన, అసలైన డెయిరీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ స్వచ్ఛమైన ఉత్పత్తులు వెంటనే అందుబాటులోకి తెచ్చుకోలేని పక్షంలో, కృత్రిమ డెయిరీతో చేసే వంటకాలను తమ మెనూ నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశించింది. సప్లయర్లు ఇచ్చే ప్రాసెస్డ్ ఫుడ్ లేబుళ్లు, వాటిలోని దినుసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వంటకాలను సిద్ధం చేయాలని సూచించింది.

కస్టమర్ల ఆరోగ్య రక్షణకే మొదటి ప్రాధాన్యం

కృత్రిమ పదార్థాల వాడకం ద్వారా వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడే ఏ ఒక్క హోటల్‌ను ఉపేక్షించే ప్రసక్తి లేదని జొమాటో స్పష్టం చేసింది. నిబంధనలను పాటించడంలో విఫలమయ్యే భాగస్వాములను ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించే సంపూర్ణ హక్కును కంపెనీ తన వద్దే ఉంచుకుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఆహార భద్రత ప్రామాణికాలకు అనుగుణంగా ప్రతీ వంటకం ఉండాలని స్పష్టం చేసింది.

నాణ్యమైన ఆహారమే లక్ష్యం: జొమాటో సీఈఓ

అధిక సంఖ్యలో ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని జొమాటో సీఈఓ ఆదిత్య మంగళ్ తెలిపారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు రెస్టారెంట్లు అందించే ఆహారంలో పారదర్శక ప్రమాణాలు నెలకొల్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే భాగస్వాములతో కలసి నాణ్యమైన సేవలు అందించడానికి నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు.

Tags: