Suriya and Jyothika: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆదర్శ జంటగా పేరుగాంచిన స్టార్ హీరో సూర్య, నటి జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ప్రత్యేకంగా, సరికొత్త పద్ధతిలో జరుపుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, ఇరు కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట మరోసారి పెళ్లి ప్రమాణాలు స్వీకరించింది.

శ్వేతవర్ణ దుస్తుల్లో తళుక్కుమన్న స్టార్ జోడీ

ఈ వేడుకలో సూర్య, జ్యోతికల లుక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జ్యోతిక అందమైన తెల్లటి బ్రైడల్ గౌను ధరించగా, సూర్య వైట్ టక్సేడోలో రాకుమారుడిలా మెరిసిపోయారు. తల్లి జ్యోతిక చేయి పట్టుకుని కుమారుడు దేవ్ నడుస్తూ వేదిక వద్దకు తీసుకువచ్చిన క్షణం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది. కుమార్తె దియాతో పాటు సూర్య సోదరుడు, నటుడు కార్తీ ఈ ఆత్మీయ వేడుకలో పాల్గొని సందడి చేశారు.

"మాది పర్ఫెక్ట్ పెళ్లి కాదు.. మా 20 ఏళ్ల యుద్ధానికి సీక్వెల్!"

ఈ అపురూప వేడుకకు సంబంధించిన అందమైన వీడియోను జ్యోతిక తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఓ భావోద్వేగ నోట్‌ను రాసుకొచ్చారు. "మా 20 ఏళ్ల లవ్ అండ్ వార్ ప్రయాణానికి ఇది సీక్వెల్. నిజానికి మాది పరిపూర్ణమైన వివాహమేమీ కాదు. ఇందులో ఎన్నో లోపాలున్నాయి.. సర్దుబాట్లు, పరస్పర అవగాహన, త్యాగాలు, నిస్వార్థమైన ప్రేమతో పెనవేసుకున్న బంధం ఇది." అని రాసుకొచ్చింది.

సెట్‌పై మొదలైన పరిచయం.. 20 ఏళ్ల విజయవంతమైన ప్రయాణం

1999లో వచ్చిన పూవెల్లం కెట్టుప్పార్ చిత్ర షూటింగ్ సమయంలో సూర్య, జ్యోతిక తొలిసారి కలిశారు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి 2006 సెప్టెంబర్ 11న పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ అన్యోన్యంగా ఉంటూ ఆదర్శ దంపతులుగా నిలిచిన ఈ జంట, 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడంపై అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Tags: