Rajinikanth–Kamal Haasan Combo: రజినీ-కమల్ కాంబోలో బిగ్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?
డైరెక్టర్ ఎవరంటే..?
Rajinikanth–Kamal Haasan Combo: తమిళ సినీ పరిశ్రమలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న ఇద్దరు టాప్ హీరోలు.. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఇప్పుడు కొత్త పాత్రల్లో కలిసి పనిచేయనున్నారు. రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న 173వ చిత్రాన్ని కమల్ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుందర్ సి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కమల్ హాసన్ తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. రజినీకాంత్‌తో దిగిన ఫోటోను పంచుకున్నారు. ఆయన దీన్ని అద్భుత కళాఖండం చిత్రంగా అభివర్ణించారు.
ఈ ప్రాజెక్ట్ భారతీయ సినిమాలోని రెండు దిగ్గజ శక్తులను కలపడమే కాకుండా కమల్ హాసన్-రజినీకాంత్‌ల మధ్య ఉన్న ఐదు దశాబ్దాల సుదీర్ఘ స్నేహాన్ని, సోదరభావాన్ని చాటిచెప్తుంది. రాజ్‌కమల్ ఫిలింస్ తమ సంస్థ 44 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది.
రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ భారీ సినిమా 2027 సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. రజినీకాంత్ అసాధారణమైన స్క్రీన్ ప్రజెన్స్, సుందర్ సి దర్శకత్వ సామర్థ్యం, కమల్ హాసన్ యొక్క ఉన్నత నిర్మాణ విలువలు కలగలిపి ఈ చిత్రాన్ని ఒక అత్యున్నత స్థాయి సినీ అనుభూతిగా మారుస్తాయని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.