Aakhri Sawal Movie Review: ఇది కేవలం సినిమా కాదు…జాతీయ స్థాయి చర్చ!

ఆఖరి సవాల్ చిత్రంలో “సత్యాన్ని దాచలేరు… మార్చలేరు” అనే బలమైన సందేశంతో ఆలోచింపజేసే పొలిటికల్ డ్రామా. ఇంకా చెప్పాలంటే..

Update: 2026-05-16 13:36 GMT

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, నమాషి చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం “ఆఖరి సవాల్ (Aakhri సవాల్)”. అభిజీత్ మోహన్ వరంగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ డిబేట్ డ్రామా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలైంది. కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా దేశంలోని ప్రధాన సిద్ధాంతాల మధ్య జరిగే ఘర్షణగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు (Aakhri Sawal Movie Review) చూద్దాం.

కథ

ఈ సినిమా కేరళలో జరిగిన ఒక ఆర్‌ఎస్‌ఎస్ (RSS) కార్యకర్త శ్రీనాథ్ భయానక హత్య తాలూకూ ఫ్లాష్‌బ్యాక్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథ ఒక్కసారిగా 2026 ముంబై నగరానికి షిఫ్ట్ అవుతుంది. ముంబైలోని ఒక కాలేజీలో ప్రొఫెసర్ గోపాల్ నాడ్‌కర్ణి (సంజయ్ దత్) లెఫ్ట్ వింగ్ భావజాలానికి కట్టుబడిన వ్యక్తి. అదే కాలేజీలో చదివే విక్కీ హెగ్డే (నమాషి చక్రవర్తి) అనే విద్యార్థి ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలపై ఒక థీసిస్‌ను సమర్పిస్తాడు. అయితే ప్రొఫెసర్ నాడ్‌కర్ణి ఆ థీసిస్‌ను తిరస్కరిస్తాడు.

అక్కడి నుంచి గురు-శిష్యుల మధ్య మొదలైన సిద్ధాంతాల పోరు క్రమంగా జాతీయ స్థాయి చర్చగా మారుతుంది. తన థీసిస్‌ను తిరస్కరించడంపై ఆగ్రహించిన విక్కీ.. ఆర్‌ఎస్‌ఎస్‌పై తా తాను సంధించే ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రొఫెసర్‌కు బహిరంగ సవాల్ విసురుతాడు. ఈ క్రమంలో కాలేజీలో జరిగిన తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రొఫెసర్ నాడ్‌కర్ణి విద్యార్థి విక్కీని చెంపదెబ్బ కొడతాడు. ఈ ఒక్క సంఘటన దేశవ్యాప్తంగా మీడియాలో పెద్ద వివాదానికి దారితీస్తుంది.

సిద్ధాంత పోరు

క్లాస్‌రూమ్‌లో ఇద్దరి మధ్య మొదలైన ఈ వ్యక్తిగత వివాదం.. రాజకీయనాయకులు, మీడియా సంస్థలు రంగంలోకి దిగడంతో లైవ్ టెలివిజన్ డిబేట్‌గా మారుతుంది. లెఫ్ట్ భావజాలాన్ని బలంగా సమర్థించే ప్రొఫెసర్ పల్లవి మీనన్ (సమీరా రెడ్డి) ఈ డిబేట్‌ను దేశవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ చేయాలని పట్టుబడుతుంది. ప్రజల అభిప్రాయమే అసలు సత్యమని ఆమె గట్టిగా నమ్ముతుంది.

ఇలా టీవీ స్టూడియో వేదికగా జరిగే వాదోపవాదాలు కేవలం ఇద్దరి మధ్య వాదనగా కాకుండా రెండు విభిన్న భావజాలాల మధ్య యుద్ధంగా మారుతుంది. ముఖ్యంగా సినిమాలో చివర్లో విక్కీ సంధించే ఐదో ప్రశ్న “ఆఖరి సవాల్” కథను ఊహించని మలుపు తిప్పుతుంది. అదే క్లైమాక్స్‌కు అత్యంత బలమైన భావోద్వేగ, సిద్ధాంతాత్మక ముగింపును ఇస్తుంది.

స్క్రీన్‌ప్లే & దర్శకత్వ విశ్లేషణ

రచయిత ఉత్కర్ష్ నైథాని రాసిన స్క్రీన్‌ప్లే పూర్తిగా డైలాగ్స్ ఆధారంగా చాలా బలంగా నడుస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్ చుట్టూ దశాబ్దాలుగా ఉన్న ఆరోపణలు, అపోహలను సమకాలీన రాజకీయ నేపథ్యంలో చాలా లోతుగా చర్చించే ప్రయత్నం చేశారు. గాంధీ హత్య, ఎమర్జెన్సీ, బాబ్రీ మసీదు వంటి దేశ చరిత్రలోని అత్యంత సున్నితమైన అంశాలను కేవలం భావోద్వేగాలకు పోకుండా, ఇరువర్గాల వాదనల రూపంలో తార్కికంగా చూపించడం ఈ సినిమా ప్రత్యేకత. దీంతో పాటు నేటి మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వంద్వ వైఖరిని కూడా ఈ సినిమా ఎండగట్టింది. ఒకప్పుడు సిద్ధాంతాల పరంగా ఒక వ్యక్తిని దూరం పెట్టిన మీడియా సంస్థలే. ఇప్పుడు కేవలం TRP రేటింగుల కోసం వారిని ఎలా వాడుకుంటున్నాయనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు.

దర్శకుడు అభిజీత్ మోహన్ వరంగ్ కథను క్లియర్‌గా, ఎక్కడా ఫోకస్ కోల్పోకుండా నడిపించారు. 117 నిమిషాల క్రిస్ప్ నిడివితో సినిమా ఎక్కడా అనవసరంగా సాగదీసినట్లు అనిపించదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం ప్రేక్షకులను గ్రిప్పింగ్‌గా కూర్చోబెడుతుంది. మోంటీ శర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సాధారణంగానే ఉన్నప్పటికీ.. క్లైమాక్స్‌లో వచ్చే “హై ప్రీత్ జహాన్ కి రీత్ సదా” పాట సినిమాలోని ఎమోషన్‌ను మరింత పెంచుతుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్

ప్రొఫెసర్ నాడ్‌కర్ణి పాత్రలో సంజయ్ దత్ (Sanjay Dutt) తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. భావోద్వేగ, సీరియస్ సన్నివేశాల్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు పెద్ద అసెట్. ఇక విద్యార్థిగా నటించిన నమాషి చక్రవర్తి (Namashi Chakraborty) ఆశ్చర్యపరిచే స్థాయిలో మెప్పించాడు. తన సిద్ధాంతంపై నమ్మకంతో ప్రొఫెసర్‌ను ఎదురించే యువకుడి పాత్రలో ఎంతో పరిణతితో నటించాడు.

న్యూస్ యాంకర్‌గా కనిపించిన అమిత్ సాధ్ (Amit Sadh) చిన్న పాత్రే అయినప్పటికీ మంచి ఇంపాక్ట్ చూపించాడు. ట్రిధా చౌదరి కూడా తన పరిధి మేర ఆకట్టుకుంది. అయితే ప్రొఫెసర్ పల్లవి మీనన్‌గా నటించిన సమీర రెడ్డి (Sameera Reddy) పాత్ర కొన్ని సందర్భాల్లో కాస్త అతిగా ప్రవర్తించినట్లు అనిపిస్తుంది.

ఫైనల్ వర్డిక్ట్

“ఆఖరి సవాల్” అనేది కేవలం ఒక కమర్షియల్ సినిమా కాదు.. అదొక సుదీర్ఘ భావజాల చర్చ. దీనిని కొందరు రాజకీయ వ్యాఖ్యానంగా చూడొచ్చు, మరికొందరు సిద్ధాంత రక్షణగా భావించొచ్చు. కానీ సినిమా ముగిసిన తర్వాత కూడా థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుల మనసులో ఇందులో అడిగిన ప్రశ్నలు గట్టిగా మిగిలిపోతాయి. బలమైన డైలాగ్స్, సిద్ధాంతాలు, వాదనలతో కూడిన ఒక విభిన్నమైన పొలిటికల్ డ్రామాను చూడాలనుకునే వారికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్.

దర్శకుడు: అభిజీత్ మోహన్ వరంగ్

నటీనటులు: సంజయ్ దత్, నమాషి చక్రవర్తి, అమిత్ సాధ్, సమీర రెడ్డి, ట్రిధా చౌదరి తదితరులు.

రేటింగ్: 3/5

రివ్యూ రాసిన వారు: లిపికా వర్మ (సీనియర్ జర్నలిస్ట్)

Tags:    

Similar News