Shruti Haasan: మగవాళ్లకీ పీరియడ్స్ వస్తే ఆ బాధ తెలుస్తుంది.. శ్రుతి హాసన్ బోల్డ్ కామెంట్స్..
శ్రుతి హాసన్ బోల్డ్ కామెంట్స్..
Shruti Haasan: పీరియడ్స్ సమయంలో మహిళలు పడే శారీరక, మానసిక వేదన అంతా ఇంతా కాదు. సాధారణ ఉద్యోగినులైనా, గ్లామర్ రంగంలో ఉండే హీరోయిన్లయినా ఈ సమయంలో విపరీతమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. తాజాగా ఇదే అంశంపై ప్రముఖ నటి శ్రుతి హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. పురుషులకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండునని, కనీసం అప్పుడైనా సినీ కాంట్రాక్టులలో 'పీరియడ్ లీవ్స్' తప్పనిసరి చేసేవారేమోనని ఆమె కుండబద్దలు కొట్టారు. నటి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న తాజా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శ్రుతి హాసన్, మహిళా నటీమణులు షూటింగ్ సెట్లలో పడే ఇబ్బందులపై మనసు విప్పి మాట్లాడారు.
పీసీఓఎస్ బాధ.. కెరీర్ ప్రారంభంలో మౌనం
తాను పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్యతో బాధపడుతున్నానని శ్రుతి హాసన్ వెల్లడించారు. దీనివల్ల పీరియడ్స్ రోజుల్లో విపరీతమైన కడుపునొప్పి, నీరసం వేధించేవని చెప్పారు. కెరీర్ మొదట్లో ఈ సమస్య గురించి ఎవరికీ చెప్పలేక, లోలోపలే ఆ వేదనను భరించినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. నెలసరి సమస్యల గురించి మాట్లాడటం సమాజంలో నిషిద్ధంగా భావించడం వల్ల, షూటింగ్‌లలో ఎనర్జీ తగ్గిపోయినా కారణం చెప్పలేక ఇబ్బంది పడ్డానని తెలిపారు.
ఆలోచన మార్చిన సంఘటన
ఒక సినిమా షూటింగ్ సమయంలో తన సహనటుడికి మోకాలి శస్త్రచికిత్స జరిగిందని, ఆ సమయంలో చిత్ర బృందం మొత్తం అతనికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుందని శ్రుతి వివరించారు. పురుషుల ఆరోగ్య సమస్యలపై చూపించే శ్రద్ధను చూసిన తర్వాతే, మహిళలు కూడా తమ సమస్యలను దాచుకోకుండా ధైర్యంగా చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.
ఆ తర్వాత ఓ దర్శకుడికి తన ఆరోగ్య పరిస్థితిని వివరించగా, ఆయన కుటుంబంలోనూ ఆడపిల్లలు ఉండటంతో పరిస్థితిని అర్థం చేసుకుని షూటింగ్‌లో తగిన వెసులుబాటు కల్పించారని శ్రుతి చెప్పారు. ఆ సానుకూల అనుభవం తర్వాత నుంచి షూటింగ్ సెట్లలో తన ఆరోగ్య సమస్యలపై మొహమాటం లేకుండా మాట్లాడటం మొదలుపెట్టానని వెల్లడించారు.
సరదాగా సాగిన పాడ్‌కాస్ట్ సంభాషణ
శ్రుతి అభిప్రాయాలకు హోస్ట్ సోహా అలీ ఖాన్ కూడా మద్దతు పలికారు. ఒకవేళ మగవాళ్లకే గనక నెలసరి వస్తే.. ఆ నొప్పిని, ట్యాంపూన్ సైజులను కూడా ఒకరితో ఒకరు పోటీపడి గొప్పగా చెప్పుకునేవారేమోనంటూ సరదాగా నవ్వేశారు.
గతేడాది రజినీకాంత్‌తో కలిసి నటించిన భారీ చిత్రం కూలీలో కనిపించిన శ్రుతి, ఇటీవల పెద్ది చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె విజయ్ సేతుపతితో ట్రైన్ (తమిళం), దుల్కర్ సల్మాన్‌తో ఆకాశంలో ఒక తార (తెలుగు) చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు.