Bhagyashri Borse: రాజమౌళి డైరెక్షన్‌లో నటించడమే నా డ్రీమ్: భాగ్యశ్రీ బోర్సే
భాగ్యశ్రీ బోర్సే
Bhagyashri Borse: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ బ్యూటీ ఫుల్ ఖుషీలో ఉంది. ఈ సినిమాలో తను పోషించిన 'భారతి' పాత్రకు వస్తున్న ప్రశంసలపై భాగ్యశ్రీ బోర్సే తాజాగా ముచ్చటించింది.
ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఎమోషనల్ అవుతున్నానని.. ఈ కథను, కంటెంట్‌ను తాము బలంగా నమ్మామని, ఆ నమ్మకం నిజం కావడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పింది. అంతేకాదు.. కింగ్ నాగార్జున గారు స్వయంగా వేదికపై తన నటనను మెచ్చుకోవడం, రివ్యూలలో ప్రత్యేకంగా ప్రస్తావించడం నటిగా తన బాధ్యతను మరింత పెంచిందని అంటోంది.
హైదరాబాద్‌తో తనకున్న అనుబంధం గురించి చెబుతూ.. ‘తెలుగు పరిశ్రమ, హైదరాబాద్ నాకు లైఫ్ ఇచ్చాయి. ఇక్కడి ప్రేక్షకులు నన్ను ఒక పరాయి అమ్మాయిలా కాకుండా తెలుగమ్మాయిలా గుండెల్లో పెట్టుకున్నారు. ఈ అనుబంధం జీవితాంతం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని తన ప్రేమను చాటుకుంది.
ఇక తన ఫ్యూచర్ డ్రీమ్స్ గురించి మాట్లాడుతూ.. ఎప్పటికైనా దర్శకధీరుడు రాజమౌళి గారి మాస్టర్ క్లాస్ డైరెక్షన్‌లో మహారాణి లేదా యువరాణి పాత్రలో నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది. అలాగే సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా చూసి ఫిదా అయిపోయానని.. అలాంటి లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేయాలని ఉందని పేర్కొంది. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ‘సీయోన్’ సినిమా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను త్వరలోనే ఎనౌన్స్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది.