Actress Files Complaint: సినిమా చాన్స్ పేరుతో లైంగిక వేధింపులు..బంజారాహిల్స్ లో నటి ఫిర్యాదు

బంజారాహిల్స్ లో నటి ఫిర్యాదు

Update: 2026-06-15 06:42 GMT

Actress Files Complaint: టాలీవుడ్‌లో సినిమా అవకాశాల పేరుతో ఆశ చూపి, మహిళా ఆర్టిస్టులను లొంగదీసుకునే ‘క్యాస్టింగ్ కౌచ్’ దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా, సినిమా అవకాశాలు కల్పిస్తానంటూ మోసపూరిత మాటలు చెప్పి.. ఓ సినీ నటితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, ఆమెకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడిన క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్ర పరిశ్రమలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఓ సినీ నటిని ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్ సంప్రదించాడు. ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమాలో కథానాయిక స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. దీంతో ఆ నటి సదరు సినిమాలో నటించింది. 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. అయితే, షూటింగ్ ముగిసినప్పటి నుంచి ఆమెకు నటించినందుకు ఇవ్వాల్సిన 90 వేల రూపాయల పారితోషికంతో పాటు, ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఇవ్వాల్సిన 38 వేల రూపాయలను ఇవ్వకుండా ప్రసాద్ కాలయాపన చేస్తూ వచ్చాడు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బంజారాహిల్స్‌లో ఉండే ఓ ప్రముఖ సినీ నిర్మాత కార్యాలయం వద్ద కలవాలని సదరు నటిని ప్రసాద్ పిలిపించాడు. తీరా అక్కడికి వెళ్ళాక బకాయి నగదు ఇవ్వకపోగా.. ఆమెను భయపెట్టి, బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నాడు. కొంతదూరం తీసుకెళ్లాక.. సినిమాలో మరిన్ని మంచి అవకాశాలు కల్పిస్తానని, అందుకు తన కోరికలు తీర్చాలంటూ నటితో తీవ్రంగా అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో భయం, అవమానంతో అక్కడి నుంచి వచ్చేసిన బాధితురాలు.. జరిగిన ఘోరాన్ని తన తల్లికి వివరించింది. నటి తల్లి ప్రసాద్‌కు ఫోన్ చేసి నిలదీయగా.. ఆమెను సైతం నిందితుడు దుర్భాషలాడి, తీవ్ర పరిణామాల ఉంటాయని బెదిరించాడు. చివరకు నిందితుడి నుంచి తమకు రక్షణ కల్పించాలని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో.. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ప్రసాద్ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.

Tags:    

Similar News